AAP on UCC: ఉమ్మడి పౌర స్మృతిపై 'ఆప్' స్పష్టత ఇచ్చేసింది...
ABN , First Publish Date - 2023-06-28T15:19:34+05:30 IST
దేశంలో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బోఫాల్ వేదికగా మాట్లాడటంతో దీనిపై రాజకీయ పార్టీల్లో చర్చ ఊపందుకుంది. తాజాగా యూసీసీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే, దీనిపై అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృత చర్యలు జరపాలని పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narndra Modi) బోఫాల్ వేదికగా మాట్లాడటంతో దీనిపై రాజకీయ పార్టీల్లో చర్చ ఊపందుకుంది. తాజాగా యూసీసీకి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మద్దతు ప్రకటించింది. అయితే, దీనిపై అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృత చర్యలు జరపాలని పేర్కొంది.
''దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోంది. దీనితో మేము ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాలి'' అని ఆప్ నేత సందీప్ పట్నాయక్ ఒక ట్వీట్‌లో తెలిపారు.
మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ మంగళవారం మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకావాలన్నారు. రెండు రకాల చట్టాలతో కుటుంబం మనుగడ కొనసాగగలదా? అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ కుటుంబం సజావుగా మనుగడ సాగించగలుగుతుందా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌర స్మృతి దేశానికి అవసరమని తెలిపారు. కాగా, దేశంలోని అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యూసీసీ చర్చను ప్రధాని లేవనెత్తారంటూ కాంగ్రెస్, డీఎంకే, మజ్లిస్ పార్టీలు మండిపడ్డాయి. యూసీసీని వ్యతిరేకించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్టు సమావేశంలో కూడ నిర్ణయం తీసుకున్నారు.