Adani Group : రక్షణ సంస్థపైనా అదానీ ఆధిపత్యమా?

ABN , First Publish Date - 2023-03-16T04:34:02+05:30 IST

అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన కీలక విదేశీ పెట్టుబడుల సంస్థ.. అదానీ గ్రూపుతో కలిసి ఒక రక్షణ సంస్థకు సహ యజమానిగా ఉండడంపై రాహుల్‌గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ..

 Adani Group : రక్షణ సంస్థపైనా అదానీ ఆధిపత్యమా?

బెంగళూరుకు చెందిన రక్షణ పరికరాల తయారీ సంస్థ

అల్ఫా డిజైన్‌లో అదానీ గ్రూపునకు 26 శాతం వాటా

అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టే మారిషస్‌ సంస్థ

ఎలారా ఐవోఎఫ్‌కూ అందులో 25.65 శాతం షేర్లు

రెండింటినీ కలిపితే రక్షణ సంస్థపై అదానీకే పెత్తనం

మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విపక్షాలు

అక్రమాలపై దర్యాప్తు చేయండి.. ఈడీకి 18 పార్టీల లేఖ

న్యూఢిల్లీ, మార్చి 15: అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన కీలక విదేశీ పెట్టుబడుల సంస్థ.. అదానీ గ్రూపుతో కలిసి ఒక రక్షణ సంస్థకు సహ యజమానిగా ఉండడంపై రాహుల్‌గాంధీ సహా పలువురు విపక్ష నేతలు మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశానికి సంబంధించి ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌స’లో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తన సన్నిహితుల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ దేశ భద్రత ప్రయోజనాలను ఎందుకు త్యాగం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘భారతదేశ క్షిపణి, రాడార్‌ అభివృద్ధి కాంట్రాక్టును.. అదానీతోపాటు, ఎలారా అనే ఒక సందేహాస్పద విదేశీ సంస్థ యాజమాన్యంలోని కంపెనీకి ఇచ్చారు. ఎలారా కంపెనీని నియంత్రించేది ఎవరు? వ్యూహాత్మక రక్షణ పరికరాలపై గుర్తుతెలియని విదేశీ సంస్థలకు నియంత్రణ కల్పించడం ద్వారా దేశ భద్రత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారు?’’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా మోదీ సర్కారుపై ట్విటర్‌లో మండిపడ్డారు. ‘‘ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఈ అంశంపై పార్లమెంటులో చర్చకూ ఒప్పుకోరు.. దర్యాప్తూ జరిపించరు.. ఎందుకు?’’ అని ఆమె నిలదీశారు.

కాంగ్రె్‌స సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ దీనిపై అదానీకి మూడు ప్రశ్నలను సంధించారు. ‘‘ఎలారా కంపెనీ బెంగళూరుకు చెందిన అల్ఫాడిజైన్‌ టెక్నాలజీస్‌ అనే రక్షణ సంస్థకు సహ యజమాని అని ఒక వార్తా కథనం వచ్చింది. దాని ప్రకారం.. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంస్థకు అల్ఫా డిజైన్‌లో 26ు వాటా ఉంది. ఎలారా ఫండ్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా 25.65 శాతం వాటా ఉంది. 2022 డిసెంబరు నాటికి ఎలారా ఐవోఎఫ్‌ ఈక్విటీ రూ.24,600 కోట్లలో.. అసాధారణంగా 99ు అంటే రూ.24,335 కోట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌లో పెట్టుబడిగా పెట్టింది. అల్ఫాడిజైన్‌ సంస్థ ఏమో.. ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలను, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తుంది. అలాంటి కీలకమైన సంస్థలో.. అసలు లబ్ధిదారులైన యజమానులెవరో తెలియని విదేశీ సంస్థకు మెజారిటీ వాటా ఉండడాన్ని అనుమతించాలా?’’ అని ఆయన నిలదీశారు. ఎలారా కంపెనీకి.. స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. ‘మీ సన్నిహితుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం కోసం.. దేశ భద్రత ప్రయోజనాలను త్యాగం చేస్తారా?’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా దీనిపై ట్వీట్‌ చేశారు. ‘‘చుపారుస్తుం కేటగిరీలో ఆస్కార్‌ అవార్డులు ప్రకటిస్తే గనక.. డీఆర్‌డీవో ఇండియా, పీఐబీ హోం ఎఫైర్స్‌కు ఆ అవార్డు దక్కుతుంది. ఎందుకంటే.. డిఫెన్స్‌ కాంట్రాక్టులను నియంత్రించే విదేశీ నిధులు ఆ సంస్థలు సంతోషంగా స్వీకరిస్తాయి. అదీ తమ ఆప్తమిత్రుడు అదానీ కోసం’’ అని ఎద్దేవా చేశారు.

ఇదీ నేపథ్యం..

మారిష్‌సలో నమోదైన ఎలారా ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌ (ఎలారా ఐవోఎఫ్‌) అనే వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ సంస్థ.. అదానీ గ్రూపు కంపెనీల్లో గణనీయంగా షేర్లను కలిగి ఉంది. అయితే, అది కేవలం అదానీ గ్రూపులో కీలక ఇన్వెస్టరే కాదని.. బెంగళూరుకు చెందిన ‘అల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏడీటీఎల్‌)’ అనే రక్షణ సంస్థలో అదానీ గ్రూపుతో కలిసి ప్రమోటర్‌గా వ్యవహరిస్తోందని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌స’లో ఒక కథనం ప్రచురితమైంది. ఇస్రోతో, డీఆర్‌డీవోతో కలిసి పనిచేసే ఏడీటీఎల్‌ కంపెనీ 2003లో ప్రారంభమైంది. 2020లో ఈ సంస్థ రక్షణ శాఖతో రూ.590 కోట్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ కంపెనీలో అదానీ గ్రూపునకు 26ు షేర్లు ఉండగా.. ఏడీటీఎల్‌లో ప్రధాన వాటాదారు అయిన ‘వసాకా ప్రమోటర్స్‌ అండ్‌ డెవలపర్స్‌’కు 56.7ు షేర్లు ఉన్నాయి. కానీ అందులో 44.3ు షేర్లను 2018లో ఎలారా సంస్థ కొనుగోలు చేసింది. అదానీ గ్రూపునకు ఉన్న 26 శాతం షేర్లను, ఎలారా కంపెనీకి ఉన్న షేర్లను కలిపితే.. ఏడీటీఎల్‌ను నియంత్రించే స్థాయిలో 51.64ు షేర్లు ఆ రెండు సంస్థలకే ఉన్నట్టు. అంటే.. మన రక్షణ శాఖకు పరికరాలు సరఫరా చేసే సంస్థపై అదానీ గ్రూపు, ఆ గ్రూపులో కీలక ఇన్వెస్టర్‌ నియంత్రణ ఉన్నట్టే!! అందుకే విపక్షాలు బుధవారం ఈ వ్యవహారంపై లోక్‌సభలో మోదీ సర్కారును దునుమాడాయి.’’

అదానీ కోసం ప్రజాస్వామ్యానికి తూట్లు

యూకే పర్యటనలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అదానీని కాపాడేందుకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తూ బీజేపీ నేతలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతే బుధవారం ధ్వజమెత్తారు. రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుపడుతున్న బీజేపీ నేతలు చైనా, కొరియాతోపాటు పలు విదేశీ పర్యటనల్లో మోదీ ఏం మాట్లాడారో మరోసారి చూడాలని సూచించారు. రాహుల్‌పై విమర్శలు చేస్తున్న స్మృతి ఇరానీ ట్రోల్‌ శాఖ మంత్రి అని సుప్రియ ఎద్దేవా చేశారు. మరోపక్క, దేశంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, కాంగ్రెస్‌ పార్టీనే చావుబతుకుల్లో ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.’

Updated Date - 2023-03-16T04:34:02+05:30 IST