Supreme Court: తీర్పు వచ్చేదాకా వార్తలు రాయొద్దని నియంత్రించలేం
ABN , First Publish Date - 2023-02-25T01:57:29+05:30 IST
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో తీర్పు ఇచ్చే వరకు మీడియా వార్తా కథనాలు రాయకుండా ఆదేశించాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో తీర్పు ఇచ్చే వరకు మీడియా వార్తా కథనాలు రాయకుండా ఆదేశించాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అదానీ గ్రూపు అక్రమాల పుట్ట అంటూ ఇటీవల అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిలో హిండెన్‌బర్గ్ సంస్థపై దర్యాప్తు జరపాలని అడ్వకేట్ ఎంఎల్ శర్మ, మరొకరు వేసిన పిటిషన్లు రెండు ఉన్నాయి. మిగతా రెండూ అదానీ గ్రూపుపై దర్యాప్తు చేయాలని దాఖలైనవి. ఈ వ్యవహారంలో సంచలనం సృష్టిస్తున్న మీడియాను తీర్పు వెలువడే వరకు నిలువరించాలని శర్మ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేశారు. సీజేఐ స్పందిస్తూ వాదన సహేతుకుంగా ఉండాలని సూచిస్తూ శర్మ విజ్ఞప్తిని నిరాకరించారు. మీడియాకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తెలిపారు.