Aditya L1: 16 సెకన్ల పాటు ఆగిపోయిన ఆదిత్య-ఎల్1 మిషన్.. కారణమేంటో తెలిపిన ఇస్రో

ABN , First Publish Date - 2023-10-08T19:21:06+05:30 IST

చంద్రుని ఉపరితలంపై ‘చంద్రయాన్-3’ సేఫ్ ల్యాండింగ్ చేసిన కొన్ని రోజుల్లోనే ‘ఆదిత్య-ఎల్1’ ప్రాజెక్ట్‌ను ఇస్రో ప్రారంభించింది. అక్టోబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను మోసుకొని...

Aditya L1: 16 సెకన్ల పాటు ఆగిపోయిన ఆదిత్య-ఎల్1 మిషన్.. కారణమేంటో తెలిపిన ఇస్రో

చంద్రుని ఉపరితలంపై ‘చంద్రయాన్-3’ సేఫ్ ల్యాండింగ్ చేసిన కొన్ని రోజుల్లోనే ‘ఆదిత్య-ఎల్1’ ప్రాజెక్ట్‌ను ఇస్రో ప్రారంభించింది. అక్టోబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను మోసుకొని పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు గాను ఇస్రో ఈ ప్రతిష్టాత్మక సోలార్ మిషన్‌ని చేపట్టింది. ఇప్పుడు ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబరు 6వ తేదీన దాదాపు 16 సెకన్ల పాటు ఈ మిషన్‌ని నిలిపివేసి.. 16 సెకన్ల పాటు ట్రాజెక్టరీ కరెక్షన్ మెనూవర్ (TCM) నిర్వహించినట్లు పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్-1 (ఎల్1) దిశగా దూసుకెళ్తున్న వ్యోమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు.. ఈ టీసీఎమ్ దోహదపడుతుందని ఇస్రో తెలిపింది.


అంతకుముందు సెప్టెంబర్ 19వ తేదీన ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (టీఎల్1ఐ) విన్యాసాన్ని నిర్వహించి.. ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ‘ఎల్1’ వద్దకు చేర్చే మార్గంలో ఇస్రో ప్రవేశపెట్టింది. ఇటీవల ఈ విన్యాసాన్ని ట్రాక్ చేయగా.. ట్రాజెక్టరీని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 6వ తేదీన టీఎంసీని నిర్వహించడం జరిగిందని ఇస్రో వెల్లడించింది. ఇదే సమయంలో.. ఆదిత్య ఎల్1లోని వ్యవస్థలన్నీ సజావుగానే పని చేస్తున్నాయని.. ఈ శాటిలైట్ దాని నిర్దేశిత మార్గం లాగ్రాంజ్ పాయింట్ 1 దిశగా దూసుకెళ్తోందని ఇస్రో ట్వీట్ చేసింది. తన మార్గంలో ఆదిత్య ఎల్1 ముందుకెళ్లేకొద్దీ.. కొన్ని రోజుల్లోనే మ్యాగ్నోమీటర్‌ను ఆన్ చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కాగా.. ఈ ఆదిత్య ఎల్1 భూమి ప్రభావ గోళం నుంచి విజయవంతంగా బయటపడిందని ఇదివరకే ఇస్రో తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇది 9.2 లక్షల కిమీ కంటే ఎక్కువ ప్రయాణించిందని వెల్లడించింది. దీంతో.. మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత భూ ప్రభావ పరిధి వెలుపలికి ఓ అంతరిక్ష నౌకను పంపడం ఇది రెండోసారి అని ఇస్రో పేర్కొంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఇది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 చేరిన తర్వాత.. ఈ ఆదిత్య ఎల్1 సూర్యుడిపై పరిశోధనలు చేయడం మొదలుపెడుతుంది. ఈ శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి.

Updated Date - 2023-10-08T19:21:19+05:30 IST