Aditya L1 Mission: మరికొన్ని గంటల్లో ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం.. ఇంతలో ఇస్రో చేసిన ట్వీట్ ఇది..
ABN , First Publish Date - 2023-09-01T21:29:48+05:30 IST
ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదని ఇస్రో మరోమారు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పష్టం చేసింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం శనివారం ఉన్న నేపథ్యంలో వివరాలను వెల్లడిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని ఇస్రో వెల్లడించింది. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది 1 % అని ఇస్రో వెల్లడించింది.
ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదని ఇస్రో మరోమారు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పష్టం చేసింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం శనివారం ఉన్న నేపథ్యంలో వివరాలను వెల్లడిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధన సాగిస్తుందని ఇస్రో వెల్లడించింది. సూర్యుడు, భూమి మధ్య దూరంలో ఇది 1 % అని ఇస్రో వెల్లడించింది. సూర్యుడి బాహ్య వాతావరణాన్ని ఆదిత్య-L1 అధ్యయనం చేస్తుందని వివరించింది. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో అదే జోష్‌తో ఆదిత్య-L1 మిషన్‌తో ఇస్రో ముందుకెళుతోంది. సెప్టెంబర్ 2న ఉదయం 11:50 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య-ఎల్1ను తీసుకెళ్లబోతోంది. సూర్యుడిపై పరిశోధన చేసేందుకు మొత్తం ఏడు పేలోడ్లతో ఆదిత్య-ఎల్1 నింగిలోకి దూసుకెళ్లనుంది. వీటిలో నాలుగు పేలోడ్స్ సూర్య కాంతిపై అధ్యయనం చేయనుండగా, మిగిలిన మూడు దగ్గరలో ఉండే అయస్కాంత క్షేత్రాలపై, సౌర రేణువులపై దృష్టి పెట్టనున్నాయి.
ఆదిత్య-ఎల్1 మిషన్‌లో ప్రైమరీ పేలోడ్ అయిన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ రోజుకు 1,440 ఇమేజ్‌లను గ్రౌండ్ స్టేషన్‌కు పంపించనుండటం విశేషం. ఆదిత్య ఎల్-1 109 రోజులపాటు ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లి సూర్యుడి రహస్యాలను మనకు తెలియజేస్తుంది. ఇస్రో ఇప్పటి వరకూ చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగాల్లో ఇదొకటి. నిజానికి, ఇది ఉపగ్రహమూ కాదు.. వ్యోమనౌక కూడా కాదు! ఇది ఒక అంతరిక్ష ప్రయోగశాల! ఇందులో టెలిస్కోపులు, మ్యాగ్నెటోమీటర్లు, స్పెక్ట్రోమీటర్లు, ప్లాస్మా ఎనలైజర్లు వంటి పరికరాలు ఉంటాయి. వీటి సాయంతో సూర్యుడిలో సంభవించే మార్పులను, వాటి తాలూకు సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తుంది.
ఎలా పనిచేస్తుంది..?
సూర్యుడు మండే వాయుగోళం. భూమి లాగా ఘనీభవించిన పదార్థంతో తయారైనది కాదు. సూర్యుడిలో మూడు పొరలున్నాయి. బయటకు కనిపించే, వెలుగులు విరజిమ్మే భాగం. దీనిని ఫొటోస్ఫియర్ అని అంటారు. దీని చుట్టూ ఉండే భాగం క్రోమోస్ఫియర్. ఇది గ్రహణాల సమయంలో మాత్రమే కంటికి కనిపిస్తుంది. మూడోభాగం కొరోనా. ఇది సూర్యుడి పైభాగం. అయస్కాంత క్షేత్రాలతో కూడిన ఈ కొరోనా నుంచే రేడియేషన్ వెలువడుతుంది. ఈ మూడు భాగాలను అధ్యయనం చేయటానికే ఆదిత్య ఎల్-1ను ఇస్రో పంపిస్తోంది. దాంట్లో ఉండే భిన్న పరికరాలు భిన్నమైన పనులు చేస్తాయి. అవి ఏమిటంటే..
1. సోలార్ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్: ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ నుంచి వెలువడే అతినీలలోహిత తరంగాలను ఇది గుర్తిస్తుంది.
2. విజబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్: ఇది కొరోనాపై దృష్టి పెడుతుంది. కాంతితోపాటు, పరారుణ తరంగాలను గుర్తిస్తుంది. సూర్యుడి అయస్కాంతక్షేత్రం ఉష్ణోగ్రతను, సాంద్రతను, ఇతర మార్పులను లెక్కిస్తుంది.
3. సాఫ్ట్ అండ్ హార్డ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్స్: సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌రేలను ఇవి విశ్లేషిస్తాయి. అవి ఏ ప్రాంతం నుంచి వెలువడుతున్నాయో ఆ ప్రాంతం ఉష్ణోగ్రత తదితర వివరాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
4. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్: ఎలకా్ట్రన్లు, ప్రోటాన్ల రూపంలో సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ను సోలార్ విండ్స్ అంటారు. ఈ పరికరం వీటిని విశ్లేషిస్తుంది.
5. ప్లాస్మా ఎనలైజర్: సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మా వివరాలను తెలుపుతుంది.
6. అడ్వాన్స్డ్ ట్రై యాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటో మీటర్: రేడియేషన్‌తోపాటు వెలువడే అయస్కాంత తరంగాలను గుర్తించి విశ్లేషిస్తుంది.
వీటన్నింటిని నుంచి వచ్చే సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సూర్యుడిలో కలుగుతున్న మార్పులను, వాటి ప్రభావాన్ని అంచనా వేస్తారు. తద్వారా అవసరమైన సందర్భాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టటానికి అవకాశం లభిస్తుంది. ఆదిత్య ఎల్-1 మిషన్ దాదాపు రూ.400 కోట్లు ఉండవచ్చని సమాచారం.