Aditya-L1 launch : రేపే ఆదిత్య-ఎల్1 ప్రయోగం
ABN , First Publish Date - 2023-09-01T00:55:39+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయింది. చంద్రయాన్-3 పూర్తిస్థాయి విజయం అనంతరం అదే ఉత్సాహంతో ఉన్న శాస్త్రవేత్తలు ..
నేడు ఉదయం 11:50కు కౌంట్‌డౌన్
రేపు పీఎస్‌ఎల్వీ-సీ57తో నింగిలోకి
సూళ్లూరుపేట, ఆగస్టు 31: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయింది. చంద్రయాన్-3 పూర్తిస్థాయి విజయం అనంతరం అదే ఉత్సాహంతో ఉన్న శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1ను సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సెప్టెంబరు 2న పీఎ్‌సఎల్వీ-సీ57 రాకెట్ ద్వారా 1,500 కిలోల బరువున్న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం గురువారం పర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రయోగానికి సంసిద్ధత తెలిపింది. ప్రయోగానికి 24 గంటల ముందు శుక్రవారం ఉదయం 11:50 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవనుంది. శనివారం ఉదయం 11:50 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ57 నింగిలోకి ఎగరనుంది. రెండో ప్రయోగ వేదికపై రాకెట్‌లోని అన్ని దశల పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు.