African Swine Flu: ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం.. అప్రమత్తమైన అధికారులు.. వాటిని చంపాలంటూ ఆదేశం

ABN , First Publish Date - 2023-08-19T15:57:15+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా.. రకరకాల భయంకరమైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవ మనుగడకు అవి గండంగా మారుతున్నాయి. కొన్ని వ్యాధులు మానవ తప్పిదాల కారణంగానూ, మరికొన్ని జంతువుల వల్లనో..

African Swine Flu: ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం.. అప్రమత్తమైన అధికారులు.. వాటిని చంపాలంటూ ఆదేశం

మారుతున్న కాలానికి అనుగుణంగా.. రకరకాల భయంకరమైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవ మనుగడకు అవి గండంగా మారుతున్నాయి. కొన్ని వ్యాధులు మానవ తప్పిదాల కారణంగానూ, మరికొన్ని జంతువుల వల్లనో వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పుడు కేరళలో తాజాగా ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్టు తేలింది. దీంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమై, దీన్ని అరికట్టే చర్యలు చేపడుతున్నారు. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో మలయంపాడి వద్ద ఉన్న పొలంలో ఈ స్వైన్‌ఫ్లూని నిర్ధారించారు. శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఈ ఫ్లూని నిర్ధారించడంతో.. జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో ఉన్న పందుల్ని చంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఆ ప్రాంతంతో పాటు సమీపంలోని 10 కిలోమీటర్ల పరిధిలో మరో పొలంలోని పందుల్ని సైతం చంపేసి, వాటి మృతదేహాల్ని పూడ్చాల్సిందిగా ఆదేశించారు.


ఈ ప్రాంతంలో చాలాకాలం నుంచి పందుల్ని పెంచుతున్నారు. అయితే.. ఇక్కడ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వచ్చిన తరుణంలో ఒక కిలోమీటరు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. దీంతో.. ఈ ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగానూ, అలాగే 10 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని వ్యాధి నిఘా జోన్‌గానూ అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే.. ఇక్కడ పంది మాంసం పంపిణీ, అమ్మకం, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడాన్ని మూడు నెలల పాటు నిషేధించారు. అలాగే.. గత రెండు నెలల్లో పందులను ఇతర పొలాలకు తరలించారో లేదో నిర్ధారించేందుకు అత్యవసరంగా నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులను జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ కలెక్టర్ కోరారు. ఒకవేళ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఈ ఫ్లూకి సంబంధించిన కేసులు నమోదైతే.. వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ ఫ్లూ వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి, ఇది వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వెటర్నరీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-08-19T15:57:15+05:30 IST