Air India : ఏఐ సూపర్‌ టేకాఫ్‌

ABN , First Publish Date - 2023-02-15T03:40:12+05:30 IST

ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థను ఏడాది క్రితం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌.. దాని విస్తరణకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 470 కొత్త విమానాలను కొనుగోలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ..

Air India : ఏఐ సూపర్‌ టేకాఫ్‌

ఎయిర్‌ ఇండియాకు 470 కొత్త విమానాలు

టాటా గ్రూప్‌ అగ్రిమెంట్‌ విలువ 6.4 లక్షల కోట్లు

ఎయిర్‌ బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 కొనుగోలు

టాటా గ్రూప్‌ ఆర్డర్‌.. ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందం

17 ఏళ్ల తరువాత తొలిసారి కొనుగోలు చేస్తున్న ఏఐ

భారత్‌ విజయాలకు ఈ ఒప్పందం నిదర్శనం: ప్రధాని మోదీ

బోయింగ్‌తో ఎయిర్‌ ఇండియా ఒప్పందం చరిత్రాత్మకం: బైడెన్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, ఫిబ్రవరి 14: ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థను ఏడాది క్రితం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌.. దాని విస్తరణకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 470 కొత్త విమానాలను కొనుగోలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ నుంచి 250 విమానాలను, అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ నుంచి మరో 220 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం సుమారు రూ.6.40 లక్షల కోట్ల (80 బిలియన్‌ డాలర్ల)తో ప్రపంచ విమానయాన రంగంలోనే అతిపెద్ద ఒప్పందాలను మంగళవారం కుదుర్చుకుంది. పైగా ఎయిర్‌ ఇండియా 17 ఏళ్ల తరువాత తొలిసారి విమానాలను కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ఇందులో 40 విమానాలు ఏ-350 వైడ్‌ బాడీ లాంగ్‌ రేంజ్‌ కలిగినవి కాగా, మరో 210.. ఏ-320 న్యారో బాడీ విమానాలు ఉన్నాయి. ఇక 220 బోయింగ్‌ విమానాల్లో 20.. 787ఎస్‌, 10.. 777-9ఎస్‌ వైడ్‌ బాడీ విమానాలు, 190.. 737 మ్యాక్స్‌ సింగిల్‌ ఎయిసెల్‌ విమానాలు ఉండనున్నట్లు ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి విమానం ఈ ఏడాది చివర్లో గగనతలంలోకి ప్రవేశించనున్నట్లు, మిగిలిన విమానాల సేవలు 2025లో ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. కాగా, ఎయిర్‌ బస్‌తో 250 విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోపాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పియూష్‌ గోయెల్‌, టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ బస్‌ సంస్థల సీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విమానాల కొనుగోలు ఒప్పందం భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య బంధం ఎంత బలంగా ఉందో చాటి చెప్పడంతోపాటు పౌరవిమానయాన రంగంలో భారత్‌ విజయాలకూ నిదర్శనమన్నారు. విమానయాన రంగంలో భారత్‌.. ప్రపంచంలో అతిపెద్ద మూడో శక్తిగా అవతరించనుందని, రానున్న 15 ఏళ్లలో భారత్‌కు 2000 విమానాల అవసరం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

బోయింగ్‌ విమానాల కొనుగోలు చరిత్రాత్మకం..

బోయింగ్‌ నుంచి విమానాలను కొనుగోలు చేయాలన్న ఎయిర్‌ ఇండియా నిర్ణయం చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. 220 విమానాల కొనుగోలుకు 34 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.82 లక్షల కోట్లు) కానుంది. ఇవే కాకుండా మరో 70 బోయింగ్‌ విమానాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని బైడెన్‌ తెలిపారు. వీటితో కలిపి మొత్తం రూ.3.80 లక్షల కోట్లు కానుందన్నారు. మంగళవారం కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం బైడెన్‌ మాట్లాడుతూ.. భారత్‌తో అమెరికా ఆర్థిక బంధానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విమానాల కొనుగోలు ద్వారా 44 రాష్ట్రాల్లో 10 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. భారత ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడంలో ముందుంటామని, ప్రపంచ పౌరులకు మరింత భద్రతతో కూడిన భవిష్యత్తును అందిస్తామని ప్రకటించారు. కాగా, బైడెన్‌, ప్రధాని మోదీ ఫోన్‌ ద్వారా ఈ అంశంపై చర్చించుకున్నట్లు భారత ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ఇరువురు నేతలు ఈ ఒప్పందాన్ని స్వాగతించారని, దీని ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడటంతోపాటు ఇరు దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడినట్లు పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్‌-అమెరికా ఇనిషియేటివ్‌ ఆన్‌ క్రిమికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ (ఐసీఈటీ) ప్రారంభం సందర్భంగా వివిధ రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగాలని చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే తాజా ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2023-02-15T03:43:30+05:30 IST