Palaniswami: అన్నాడీఎంకే పళనిస్వామిదే!

ABN , First Publish Date - 2023-02-24T02:07:13+05:30 IST

తమిళనాట ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) పూర్తిగా పైచేయి సాధించారు.

 Palaniswami: అన్నాడీఎంకే   పళనిస్వామిదే!

సుప్రీంకోర్టులో పన్నీర్‌సెల్వంకు నిరాశ

చెన్నై, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తమిళనాట ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలో మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) పూర్తిగా పైచేయి సాధించారు. గతేడాది జూలై 11వ తేదీన ఈపీఎస్‌ ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ పార్టీ సర్వసభ్య మండలి సమావేశం చేసిన తీర్మానం సబబేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో అన్నాడీఎంకే పూర్తిగా ఈపీఎస్‌ చేతుల్లోకెళ్లడంతోపాటు, పన్నీర్‌సెల్వం(ఓపీఎ్‌స)కు ఆ పార్టీతో ఉన్న అనుబంధం తెగిపోయినట్లైంది. జయలలిత మరణానంతరం తనను కొన్నాళ్లు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ‘ధర్మయుద్ధం’ పేరుతో తిరుగుబాటు చేసిన ఓపీఎస్‌.. కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జయ మరణంలో శశికళపైనా సందేహం వ్యక్తం చేశారు. అయితే అనంతర పరిణామాల్లో సీఎం పీఠమెక్కిన పళనిస్వామి.. శశికళను గెంటేయడంతోపాటు ద్వితీయశ్రేణి నేతలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఆ తరువాత కేంద్రంలోని బీజేపీ నేతల జోక్యంతో ఓపీఎ్‌సను పార్టీలో చేర్చుకున్న ఈపీఎస్‌.. ఆయనకు పార్టీ సమన్వయకర్తగానూ, ఉపముఖ్యమంత్రిగానూ పదవులు కట్టబెట్టారు.

తర్వాత, ఓపీఎస్‌, శశికళ చేరువవుతున్నారని, పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని గ్రహించిన ఈపీఎస్‌.. గతేడాది జూలై 11వ తేదీన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తానే ఎన్నికయ్యేలా వ్యూహరచన చేశారు. కాగా, యుద్ధం ఇంకా ముగియలేదని, తన ధర్మ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఓపీఎస్‌ అన్నారు. మరోవైపు పార్టీ ద్రోహులకు గుణపాఠం చెబుతామని ఈపీఎస్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా శశికళతో కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు ఓపీఎస్‌ సన్నాహాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - 2023-02-24T02:07:14+05:30 IST