UP Encounter: న్యాయం జరిగిందన్న ఉమేశ్ పాల్ తల్లి, ఫేక్ ఎన్‌కౌంటర్ అంటోన్న అఖిలేష్

ABN , First Publish Date - 2023-04-13T22:27:49+05:30 IST

ఫేక్ ఎన్‌కౌంటర్ అని ఆయన ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలని ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను(Yogi) డిమాండ్ చేశారు.

UP Encounter: న్యాయం జరిగిందన్న ఉమేశ్ పాల్ తల్లి, ఫేక్ ఎన్‌కౌంటర్ అంటోన్న అఖిలేష్
Akhilesh Yadav comments on UP Encounter

లక్నో: ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ (Gangster politician Atiq Ahmed) కుమారుడు అసద్(Asad), అతడి సహచరుడు గులాం(Ghulam) హతమైన ఘటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) స్పందించారు. ఫేక్ ఎన్‌కౌంటర్ అని ఆయన ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలని ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను(Yogi) డిమాండ్ చేశారు.

మరోవైపు ఎన్‌కౌంటర్‌పై ఉమేశ్ పాల్ కుటుంబ సభ్యులు స్పందించారు. తమ కుమారుడికి న్యాయం జరిగిందన్నారు. యూపీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్‌కౌంటరైన అసద్, గులాం న్యాయవాది ఉమేశ్‌పాల్ (Umesh Pal) హత్యకేసులో నిందితులు. వీరిద్దరి తలపై ఐదు లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఉమేశ్ పాల్ హత్య సమయంలో కాల్పులు జరుపుతున్న వీడియోలో అసద్ కూడా ఉన్నారు. ఉమేశ్ పాల్ హత్య తర్వాత అసద్, గులాం లక్నో పారిపోయారు. ఆ తర్వాత కాన్పూర్‌కు, మీరట్‌కు, ఢిల్లీకి వెళ్లినట్లు కూడా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఝాన్సీ బోర్డర్ వద్ద పోలీసులు తమను గుర్తించినట్లుగా అనుమానించిన వీరిద్దరూ బైక్‌పై పారిపోతూ ఎన్‌కౌంటర్ అయ్యారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంక్ అధికారులతో పాటు మొత్తం 12 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. నిందితులపై మొత్తం 42 రౌండ్ల బుల్లెట్లు కాల్చినట్లు తెలిసింది.

ఉమేశ్ పాల్ హత్య కేసులో అతీఖ్ అహ్మద్‌‌ను, అతడి సోదరుడు అష్రఫ్‌ను పోలీసులు ప్రయాగ్‌రాజ్ ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన రోజే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వాస్తవానికి నిన్న గుజరాత్ సబర్మతీ జైలు నుంచి అతీఖ్ అహ్మద్‌‌ను, అతడి సోదరుడు అష్రఫ్‌ను రోడ్డు మార్గం గుండా ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువచ్చారు. ఇద్దరికీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 5 రోజుల పోలీస్ కస్టడీకి కూడా అప్పగించింది.

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ సాక్షి. న్యాయవాది కూడా. ఆయన్ను ప్రయాగ్‌రాజ్‌లో ఇంటివద్దే ఈ ఏడాది ఫిబ్రవరి 12న పట్టపగలు కాల్చి చంపారు. ఉమేశ్ పాల్‌కు రక్షణగా ఉన్న సిబ్బంది కూడా నాడు కాల్పుల్లో చనిపోయారు. కాల్పులు జరుపుతున్న వీడియోలో అతీఖ్ అహ్మద్‌ కుమారుడు అసద్ స్పష్టంగా కనిపించారు. నాడు పగటివేళ జరిగిన ఉమేశ్ పాల్ హత్యోదంతంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. యూపీలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించాయి. ఘటన జరిగిన నాటినుంచీ పోలీసులు కాల్పులు జరిపి పరారైన అసద్, గులాం కోసం వెతికారు. చివరకు నిందితులిద్దరూ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

ఎమ్మెల్యేగా ఐదుసార్లు, సమాజ్‌వాదీ పార్టీ(SP) తరపున ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన అతిఖ్ అహ్మద్‌పై వందకు పైగా కేసులున్నాయి. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసుతో పాటు (BSP MLA Raju Pal) ఇటీవల జరిగిన మరో ఘటనతోనూ అతీఖ్‌కు సంబంధాలున్నాయి. తన తమ్ముడిని ఓడించాడనే కసితో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజు పాల్‌ను 3 నెలలకే చంపేశాడు. అప్పటికి రాజు పాల్‌కు వివాహమై 9 రోజులు మాత్రమే. నాడు రాజు పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో అతీఖ్ అతడి సోదరుడు ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో హాజరౌతున్నారు.

మరోవైపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన అసద్, గులాం మృతదేహాలను పోలీసులు ఝాన్సీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు.

Updated Date - 2023-04-13T22:52:29+05:30 IST