Amritpal: చిక్కినట్టే చిక్కి..

ABN , First Publish Date - 2023-03-19T01:50:04+05:30 IST

ఖలిస్థానీ వాదంతో.. విద్వేష వ్యాఖ్యలతో అత్యంత సమస్యాత్మకంగా మారిన అమృత్‌పాల్‌ సింగ్‌ (29) పంజాబ్‌ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు.

Amritpal: చిక్కినట్టే చిక్కి..

తప్పించుకున్న అమృత్‌పాల్‌!

ఆయన అరెస్టుకు కేంద్రం, పంజాబ్‌ సర్కార్ల వ్యూహం

జలంధర్‌లో ఓ కార్యక్రమానికి అమృత్‌ పాల్‌ సింగ్‌

100 వాహనాలతో చేజ్‌ చేసిన పోలీసుల బృందం

వాహనం దిగి.. బైక్‌పై పరారైన వివాదాస్పద నేత

ఆరుగురు ప్రధాన అనుచరులు.. 78 మంది అరెస్ట్‌

కేంద్రం నుంచి బలగాలు.. పంజాబ్‌లో హైడ్రామా

నేటి మధ్యాహ్నం దాకా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ బంద్‌

గత నెలలో సహచరుడి విడుదలకు ఠాణా ముట్టడి

ఖలిస్థాన్‌ వాదంతో అమిత్‌ షాపై అమృత్‌ వ్యాఖ్యలు

సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

చండీగఢ్‌, జలంధర్‌, మార్చి 18: ఖలిస్థానీ వాదంతో.. విద్వేష వ్యాఖ్యలతో అత్యంత సమస్యాత్మకంగా మారిన అమృత్‌పాల్‌ సింగ్‌ (29) పంజాబ్‌ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహం పన్నినా చివరి క్షణంలో మస్కా కొట్టాడు! శనివారం పంజాబ్‌ జలంధర్‌లోని షాకోట్‌ తహసిల్‌కు అమృత్‌పాల్‌ తన కాన్వాయితో వెళుతుండగా ఏడు జిల్లాల పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం అతడిని వంద వాహనాలతో చేజ్‌ చేసింది. అయితే పోలీసుల కళ్లుగప్పి అమృత్‌పాల్‌ ఓ బైక్‌పై పరారయ్యాడని చెబుతున్నారు.

కాగా అమృత్‌పాల్‌ మస్కా కొట్టినా ఆయన ప్రధాన అనుచరులు ఆరుగురిని, మరో 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, వారిలో కొందరిని విచారిస్తున్నారని పోలీసులు వర్గాలు తెలిపాయి. అమృత్‌పాల్‌, ఆయన సానుబూతి పరులు ఎలాంటి విద్వేషపూరితమైన మెసేజ్‌లు, వీడియో సందేశాలను సర్క్యులేట్‌ చేయకుండా ఉండేందుకు పంజాబ్‌ అంతటా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల దాకా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఎలాగైనా అమృత్‌పాల్‌ ఆట కట్టించేందుకు అమృత్‌సర్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని పంజాబ్‌ పోలీసు బలగాలు, కేంద్ర పారామిలటరీ బలగాలు దిగ్బంధించాయి. అమృత్‌సర్‌ జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేశాయి.

2ajnala.jpg

గత నెలలోనే కేసు..

అచ్చంగా ఖలిస్థాన్‌ ఉగ్రవాది బింద్రన్‌వాలే తరహా వేషధారణతో, వారిస్‌ దె పంజాబీ (పంజాబ్‌ వారసులం) సంస్థ మాటున కొన్నాళ్లుగా ప్రత్యేక వాదంతో అమృత్‌పాల్‌ చెలరేగుతున్నాడు. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఆయన ప్రధాన అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తుఫాన్‌ సింగ్‌ను విడుదల చేయాలంటూ ఫిబ్రవరి 23న పెద్దఎత్తున మద్దతుదారులు తల్వార్లు, కర్రలతో అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. దీంతో తప్పనిసరై లవ్‌ప్రీత్‌ను మరుసటి రోజు వదిలిపెట్టారు. తర్వాత అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. ఖలిస్ధాన్‌ అంశంపై దివంగత ప్రధాని ఇందిరకు పట్టిన గతే కేంద్ర మంత్రి అమిత్‌ షాకు పడుతుందని అమృత్‌పాల్‌ పదేపదే వ్యాఖ్యానించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్‌పాల్‌ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నాయి. ఈ నెల 2న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. అమిత్‌ షాతో సమావేశమయ్యారు. అప్పుడే అమృత్‌పాల్‌కు చెక్‌ పెట్టాలని నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రంలో జీ-20 ప్రాంతీయ సమావేశం ఉండడంతో పోలీసు యంత్రాంగం దాదాపు నెల నుంచి ఓపిక పడుతోంది.

శుక్రవారం అవి ముగియడంతో ప్లాన్‌ అమలుకు సిద్ధమైంది. త్వరలో జలంధర్‌ ఉప ఎన్నిక కూడా ఉండటంతో ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇందుకు కేంద్రం అదనపు బలగాలను పంపించింది. జలంధర్‌ జిల్లా సరిహద్దులను మూసివేసింది. అమృత్‌పాల్‌ శనివారం పదుల సంఖ్యలో వాహనాల కాన్వాయ్‌తో షాకోట్‌కు వెళ్తున్నట్లు తెలిసి మెహ్తాపూర్‌ వద్ద పోలీసులు అడ్డగించారు. కాగా, అనుచరులు హెచ్చరించడంతో అమృత్‌పాల్‌ వాహనం మారాడు. నకోదార్‌ అనే ప్రాంతంలో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ బైక్‌పై అమృత్‌పాల్‌ పరారైనట్లు చెబుతున్నారు. ఆయన ప్రధాన అనుచరులైన ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, అమృత్‌పాల్‌ కోసం పోలీసు బలగాలు వేట మొదలు పెట్టడంతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, పంజాబ్‌ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

Updated Date - 2023-03-19T01:50:10+05:30 IST