Pakistan Anju: పాకిస్తాన్‌లో అంజుని కొట్టారా.. ఇంటర్వ్యూలో బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ABN , First Publish Date - 2023-12-01T18:41:14+05:30 IST
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు నస్రుల్లా కోసం పాకిస్తాన్‌కి వెళ్లిన అంజు.. ఇటీవల భారత్‌కి తిరిగొచ్చింది. టూరిస్ట్ వీసాపై పాకిస్తాన్‌కి వెళ్లి, నస్రుల్లాని వివాహమాడి, ఇస్లాం మతం స్వీకరించిన అంజు.. దాదాపు ఆరు నెలల తర్వాత..
Anju On Nasrullah Beating: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు నస్రుల్లా కోసం పాకిస్తాన్‌కి వెళ్లిన అంజు.. ఇటీవల భారత్‌కి తిరిగొచ్చింది. టూరిస్ట్ వీసాపై పాకిస్తాన్‌కి వెళ్లి, నస్రుల్లాని వివాహమాడి, ఇస్లాం మతం స్వీకరించిన అంజు.. దాదాపు ఆరు నెలల తర్వాత వాఘా బార్డర్ ద్వారా ఇండియాకు వచ్చింది. తొలుత ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించిన ఆమె.. తాజాగా ఒక న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన పిల్లలను కలవడం కోసమే భారత్‌కి తిరిగొచ్చానని.. పిల్లలను కలిశాక ఇక్కడే ఉండాలా? లేక పాకిస్తాన్‌కి తిరిగి వెళ్లాలా? అనేది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో అంజు మెడపై ‘గాయం’ లాంటి గుర్తు ఉండటం చూసి.. ‘మిమ్మల్ని పాకిస్తాన్‌లో కొట్టారా?’ అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. ఇందుకు ఆమె బదులిస్తూ.. అవి గాయం గుర్తులు కావని, తన నెక్లెస్ గుర్తులని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో తనని ఎప్పుడూ ఏ ఒక్కరూ కొట్టలేదని క్లారిటీ ఇచ్చింది. నస్రుల్లా కూడా తనని బాగా చూసుకున్నాడని పేర్కొంది. ఆ దాయాది దేశంలో తనకు మంచి ఆతిథ్యం లభించిందని.. అక్కడికి వెళ్లినప్పటి నుంచి భారత్‌కు తిరిగొచ్చేదాకా అందరూ తనని బాగా ఆదరించారని పేర్కొంది. ఒక నెలపాటు టూరిస్ట్ వీసాపై తాను పాకిస్తాన్‌కి వెళ్లానని, ఆపై దానిని పొడిగించుకున్నానని వెల్లడించింది. తన పిల్లల్ని చాలా మిస్ అయ్యానని, తాము మాట్లాడుకునే వాళ్లమని, కానీ పిల్లలు లేకుండా తాను ఉండలేకపోయానని చెప్పింది.
ఇదిలావుండగా.. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు అంజు జులైలో పాకిస్తాన్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఇస్లాం మతాన్ని స్వీకరించి, ఫాతిమాగా తన పేరు మార్చుకొని, నస్రుల్లాని వివాహం చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారినందుకు గాను ఆమెకు అక్కడ భారీ బహుమతులు అందాయి. ఒక కోడలిగా ఆ దేశస్తులు ఆమె సాదరంగా స్వీకరించారు. అటు.. అంజు మానసికంగా అనారోగ్యంతో ఉందని, తన పిల్లలను చాలా మిస్ అవుతుందని, అందుకే భారత్‌కి వెళ్లిందని ఆమె భర్త నస్రుల్లా కూడా స్పష్టం చేశాడు. కాగా.. భారత్‌కి తిరిగొచ్చిన తర్వాత అంజుని దర్యాప్తు సంస్థలు అరగంటపాటు విచారించారని సమాచారం.