Manipur: చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చర్చకు రావాలి- అనురాగ్ ఠాకూర్
ABN , First Publish Date - 2023-07-23T19:22:54+05:30 IST
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు. బాధితులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా మహిళలపై అఘాయిత్యాలు బాధాకరమని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని మంత్రి అన్నారు. రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల అంశంపై చర్చ జరపడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
"పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజకీయ పార్టీలన్నీ పాల్గొని మణిపూర్ అంశంపై చర్చించాలని కోరుతున్నాము. చర్చ నుంచి ఎవరూ పారిపోవద్దు. ఈ విషయమై ప్రతిపక్షాలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్షాలు ఇలాంటి అంశాలను రాజకీయం చేయొద్దు. పార్లమెంటులో చర్చకు రావాలి. చర్చ జరపాలని నిరసనలు తెలుపుతున్న ప్రతిపక్షాలు, చర్చలో మాత్రం పాల్గొనడం లేదు" అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాగా మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడడంతో ఈ నెల 20న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగలేదు. మణిపూర్ అంశంపై ప్రధాని కాకుండా హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని ప్రభుత్వం వెల్లడించింది. కానీ ప్రతిపక్షాలు అందుకు అంగీకరించడం లేదు. ప్రధానినే స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్షాలు సోమవారం పార్లమెంట్‌లో ఉమ్మడి నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. మణిపూర్ అంశంపై చర్చకు ముందు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.