AP CJ Justice Mishra : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఏపీ సీజే జస్టిస్ మిశ్రా
ABN , First Publish Date - 2023-05-17T01:21:28+05:30 IST
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా(పీకే మిశ్రా)తో పాటు తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ను సుప్రీంకోర్టులో జడ్జిలుగా నియమించాలని కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.
సుప్రీం జడ్జిగా ఏపీ హైకోర్టు సీజే మిశ్రా
సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ కూడా
కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
నియామకమైతే 2030లో సీజేఐ కానున్న విశ్వనాథన్
న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా(పీకే మిశ్రా)తో పాటు తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ను సుప్రీంకోర్టులో జడ్జిలుగా నియమించాలని కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. సీనియారిటీ, ప్రతిభ, పనితీరు, నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఇద్దరి పేర్లను సిఫారసు చేసినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. ఛత్తీ్‌సగఢ్ నుంచి సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేదని, అదే విధంగా బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయినవారు ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిని ఎంపిక చేశామని వివరించింది. జస్టిస్ ప్రశాంత్ మిశ్రా 2009 డిసెంబరు 10న ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2021 అక్టోబరు 13 నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు జడ్జిల్లో అఖిల భారత స్థాయిలో సీనియారిటీ జాబితాలో జస్టిస్ మిశ్రా 21వ స్థానంలో ఉన్నారు. అయితే, ఛత్తీ్‌సగఢ్‌కే చెందిన, ప్రస్తుత అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ జస్టిస్ మిశ్రా కంటే సీనియర్ అయినప్పటికీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మిశ్రా పేరును సిఫారసు చేసినట్లు కొలీజియం స్పష్టం చేసింది.
న్యాయవాదిగా 35 ఏళ్ల అనుభవం
న్యాయవాద వృత్తి నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన వారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక్కరే ఉన్నారని, బార్‌కు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ను సుప్రీం జడ్జిగా సిఫారసు చేశామని కొలీజియం తెలిపింది. విశ్వనాథన్ కోయంబత్తూరు న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1988లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. రెండు దశాబ్దాలకుపైగా సుప్రీం కోర్టులో ప్రాక్టిస్ చేసిన తర్వాత 2009లో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదా లభించింది. న్యాయవాదిగా విశ్వనాథన్‌కు 35ఏళ్ల అనుభవం ఉంది. వివిధ కేసుల్లో ఆయన సుప్రీం కోర్టుకు సహకరించడానికి అమైకస్ క్యూరీగా కూడా వ్యవహరించారు. ‘‘విశ్వనాథన్ 2031 మే 25 వరకు సుప్రీం జడ్జిగా కొనసాగుతారు. 2030 ఆగస్టు 11న జస్టిస్ పార్దీవాలా పదవీవిరమణ చేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం కేవీ విశ్వనాథన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు’’ అని కొలీజియం పేర్కొంది.
త్వరలో మరో నాలుగు ఖాళీలు
సుప్రీం కోర్టులో 32 న్యాయమూర్తుల పోస్టులు ఉండగా... ప్రస్తుతం రెండు ఖళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో భాగంగానే జస్టిస్ మిశ్రా, కేవీ విశ్వనాథన్ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. అయితే, జూలై రెండోవారంలోగా మరో నలుగురు జడ్జిలు పదవీ విమణ చేయనున్నారు. దీంతో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య మళ్లీ 28కి తగ్గనుంది.