Share News

Asaduddin Owaisi: మీ కల కలగానే మిగిలిపోతుంది.. సీఎం యోగికి అసదుద్దీన్ కౌంటర్

ABN , First Publish Date - 2023-11-26T22:10:56+05:30 IST

తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు.

Asaduddin Owaisi: మీ కల కలగానే మిగిలిపోతుంది.. సీఎం యోగికి అసదుద్దీన్ కౌంటర్

తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు. తెలంగాణలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. తమ బీజేపీ అధికారంలోకి వస్తే, హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని ప్రకటించారు. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు.. హైదరాబాద్ పేరు మార్చాలన్న మీ కల కలగానే మిగిలిపోతుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


ఒక బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ.. ‘‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలంగాణకు వచ్చారు. ఆయనకు ఒక పేటెంట్ డైలాగ్ ఉంది.. అదే పేరు మారుస్తాం. ఇది తప్ప ఆయన నోటి నుంచి ఇంకేమీ రాదు’’ అని దుయ్యబట్టారు. మీరు హైదరాబాద్ పేరుని ఎప్పటికీ మార్చలేరని, అది ఒక కలగానే మిగిలిపోతుందని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన ఎక్స్ ఖాతాలో ఆయన యోగికి కౌంటరిచ్చే వీడియోని ఆయన షేర్ చేశారు. ఇంకా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్‌ని రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు. మీరు మలక్‌పేటలో ఓడిపోతున్నారని, ముందు ఇక్కడికి వచ్చి పరిస్థితుల్ని చూసుకోండని హితవు పలికారు.

కాగా.. తెలంగాణలోని మెహబూబ్ నగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే, మెహబూబ్ నగర్ పేరును పాలమూరుగా మారుస్తామన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న ఆయన.. కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ బహిరంగ సభ నిర్వహించారు. ఇందుకు కౌంటర్‌గానే అసదుద్దీన్ పై విధంగా స్పందించారు. హైదరాబాద్ పేరు మార్చే సంగతి ఆ దేవుడెరుగు.. ముందు మీరు మలక్‌పేటలో గెలిచి చూపించండని సవాల్ చేశారు. ఇదిలావుండగా.. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి.

Updated Date - 2023-11-26T22:10:57+05:30 IST