Ashok Gehlot: అస్సాం సీఎం అతిగా మాట్లాడుతున్నాడు.. హిమంత బిశ్వ శర్మకు అశోక్ గెహ్లాట్ చురకలు
ABN , First Publish Date - 2023-11-18T20:05:55+05:30 IST
Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిమంత అవసరానికి మించి అతిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిమంత అవసరానికి మించి అతిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు. ఆయన్ను ఎవరూ ఇష్టపడటం లేదని, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌లోనే ఎక్కువ కాలం ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ హైకమాండ్ పట్ల తనకున్న విదేయతను నెరవేర్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలేంటి?
ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మ పర్యటించినప్పుడు.. సీఎం అశోక్ గెహ్లాట్‌పై రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్‌తో పోరాటం తర్వాత గెహ్లాట్ తన ఎమ్మెల్యేలను ‘దోచుకోవడానికి’ లైసెన్స్ ఇచ్చారని ఆరోపించారు. ‘దోచుకోవాల్సింది దోచుకోండి.. నన్ను మాత్రం సీఎంగా ఉండనివ్వండి’ అని గెహ్లాట్ తన ఎమ్మెల్యేలకు చెప్పారని పేర్కొన్నారు. గెహ్లాట్ రాష్ట్రాన్ని దోచుకున్నారని.. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వారికి తగిన సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ప్రియాంక గాంధీపై కూడా హిమంత విమర్శలు గుప్పించారు. భారతదేశంలోని హిందువుల కోసం తాను రెండు మాటలు మాట్లాడకపోతే.. బాబర్, ఔరంగజేబుల కోసం మాట్లాడుతానా? భారతదేశంలో హిందూ ఆసక్తి అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రపంచమంతా తన కుటుంబమని హిందువు అంటాడని , సంస్కృతిని మీరు కీర్తించకపోతే ఎవరిని కీర్తిస్తారని అడిగారు. ఊపిరి ఉన్నంత వరకు తాము హిందువులను కీర్తిస్తామని ప్రియాంక గాంధీకి చెప్పాలని సూచించారు.
అశోక్ గెహ్లాట్ కౌంటర్
హిమంత వ్యాఖ్యలకు సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. అతను అవసరానికి మించి మాట్లాడుతున్నాడని కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి ప్రకటనలతో హిమంత బీజేపీ హైకమాండ్ షరతును నెరవేరుస్తున్నాడని.. బీజేపీ హైకమాండ్ పట్ల తనకున్న విధేయతను చాటిచెప్తున్నాడని అన్నారు. బీజేపీకి చెందిన బయటి నేతలు రాష్ట్రానికి వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని, వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాదని, చేసిన పనులపై చర్చలు జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.