Share News

Ashok Gehlot: నేను సీఎం పదవిని వదిలిపెట్టాలనుకున్నా, అది నన్ను విడిచి పెట్టట్లేదు.. అశోక్ గెహ్లాట్ సంచలనం

ABN , First Publish Date - 2023-10-19T15:46:40+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఆ పదవి నన్ను విడిచిపెట్టడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని...

Ashok Gehlot: నేను సీఎం పదవిని వదిలిపెట్టాలనుకున్నా, అది నన్ను విడిచి పెట్టట్లేదు.. అశోక్ గెహ్లాట్ సంచలనం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఆ పదవి నన్ను విడిచిపెట్టడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నాలుగోసారి కూడా సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా మద్దతుదారు తనతో చెప్పారని అన్నారు. అందుకు ఆమె బదలిస్తూ.. తాను ఈ సీఎం పదవిని వదిలేయాలని అనుకుంటున్నానని, కానీ అది నన్ను వదిలిపెట్టట్లేదని బదులిచ్చానని తెలిపారు.


గతంలో.. గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ పైలట్ నేతృత్వంలోని క్యాంపుల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసింది. 2020లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తన క్యాంప్‌తో కలిసి తిరుగుబాటు చేసినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలింది. కాంగ్రెస్ హైకమాండ్ సైతం రాజస్థాన్ని ప్రభుత్వాన్ని కూలడం నుంచి కాపాడలేకపోయింది. అందుకే.. అవకాశం దొరికినప్పుడల్లా పైలట్‌పై అశోక్ గెహ్లాట్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు మరోసారి అతనిపై మండిపడుతూ విమర్శలు గుప్పించారు. తనలో ఏదో ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని అన్నారు. అయితే.. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఆ విషయంపై చింతిస్తోందని కౌంటర్ వేశారు. తాము పోట్లాడటం లేదని బీజేపీ ఆందోళన చెందుతోందని చురకలంటించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి, నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడి, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. నిర్ణయాలు సజావుగా జరుగుతున్నాయని, అందుకే బీజేపీకి టెన్షన్ మొదలైందన్నారు. ఒకవేళ మంచి ప్రత్యామ్నాయాలు దొరికితే.. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభ్యర్థుల్ని మారుస్తుందని గెహ్లాట్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తాను క్షమించి & మరచిపో మంత్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు.

ఇంతకుముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పైలట్ చెప్పడంతో.. అతని క్యాంప్‌లోని సభ్యులకూ టికెట్లు లభిస్తాయన్న వార్తలు వస్తున్నాయి. అటు.. ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి, ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారో చూడాలి.

Updated Date - 2023-10-19T15:46:40+05:30 IST