Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత శర్మకు ఊహించని దెబ్బ.. ఆ పని చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు

ABN , First Publish Date - 2023-09-21T18:48:41+05:30 IST

ఈమధ్య హిమంత బిశ్వ శర్మ తన అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కన్నా.. కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మైకు పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసిందని నిరాధార ఆరోపణలు చేస్తూ..

Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత శర్మకు ఊహించని దెబ్బ.. ఆ పని చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు

ఈమధ్య హిమంత బిశ్వ శర్మ తన అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కన్నా.. కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మైకు పట్టుకుంటే చాలు.. కాంగ్రెస్ పార్టీ అది చేసింది, ఇది చేసిందని నిరాధార ఆరోపణలు చేస్తూ, బీజేపీ విధేయుడిగా ప్రతీసారి నిరూపించుకుంటున్నారు. ఇందుకు తనకు బీజేపీ హైకమాండ్ నుంచి ప్రోత్సాహం బాగానే అందుతున్నట్టుంది.. అందుకే ఈరోజుల్లో తన మాటలకు మరింత పదును పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడదే ఆయన కొంపముంచింది. తాను చేసిన ఆ ఆరోపణలకు గాను ఊహించని దెబ్బ ఎదురైంది.


కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాందీపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ హిమంత బిశ్వ శర్మపై అస్సాం కాంగ్రెస్ నేత దేబాబ్రతా సైకియా ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో జరిగిన జన్ ఆశీర్వాద్ ర్యాలీలో సోనియాపై హిమంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సైకియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలోని సోనియా అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌ను తగలబెట్టాలని శర్మ పిలుపునిచ్చారని సైకియా తెలిపారు. తమ నాయకురాలిపై ద్వేషపూరిత ప్రకటన చేసినందుకే తాను ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలోని నజీర్ టౌన్‌లో సైకియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్‌పై హిమంత విరుచుకుపడ్డారని అన్నారు. ఒకవేళ కమల్‌నాథ్ నిజంగా హనుమంతుని భక్తుడైతే.. ఎలాగైతే హనుమంతుడు లంకను తగలబెట్టారో, అలాగే ఆయన 10 జన్‌పథ్‌లను తగలబెట్టాలని హిమంత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసుకున్నారు.

చట్టం అమలులో ఉన్న దేశంలో.. హిమంత బిశ్వ శర్మ తన ఎన్నికల వాక్చాతుర్యాన్ని అత్యంత దుర్భరంగా మార్చారంటూ సైకియా ధ్వజమెత్తారు. సోనియా గాంధీ పార్లమెంట్‌లో సీనియర్ సభ్యురాలు అని, ఆమె కాంగ్రెస్ & యూపీఏలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపారు. సోనియా ఎంతో గౌరవం కలిగిన మహిళ అని.. అలాంటి ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని.. హిమంత చేసిన వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటలు వస్తాయని తాను ఊహించలేదని ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-21T18:48:41+05:30 IST