బియ్యం ఎగుమతులపై నిషేధం
ABN , First Publish Date - 2023-07-21T03:31:16+05:30 IST
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రిటైల్ ధరలను అదుపులో ఉంచటానికి, దేశీయంగా సరఫరాను పెంచటానికి
న్యూఢిల్లీ, జూలై 20: బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రిటైల్ ధరలను అదుపులో ఉంచటానికి, దేశీయంగా సరఫరాను పెంచటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుం ది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతుల విధానంలో ఎటువంటి మార్పు లేదు. బియ్యం ఎగుమతుల్లో వీటిదే సింహభాగం కాగా, బాస్మతీయేతర తెల్లబియ్యం వాటా 25 శాతమే. థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాల కు ఇవి ఎక్కువగా వెళ్తుంటాయి. 2021-22లో 26.2 లక్షల డాలర్ల విలువైన బాస్మతీయేతర బియ్యం నిల్వలు ఎగుమతి కాగా, మరుసటి ఏడాది వాటి ఎగుమతుల విలువ 42 లక్షల డాలర్లకు పెరిగింది. ‘దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర తెల్లబియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో 11.5ు మేర పెరుగగా, ఈ నెల రోజుల్లో మూడు శాతం పెరుగుదల నమోదైంది’ అని ఆహారశాఖ తెలిపింది. ‘ధరలను తగ్గించటానికి, మార్కెట్లో వాటి నిల్వలను పెంచటానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఎగుమతులపై 20ు సుంకం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం వాటి ఎగుమతులు 33.66 లక్షల టన్నులు కాగా ఈ ఏడాది అవి 42.12 లక్షల టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం తదితర కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయి’ అని ఆహారశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతులపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చిందని, దీనివల్ల దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుతాయని తెలిపింది. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.