Batla House encounter: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ మృతి

ABN , First Publish Date - 2023-01-28T16:48:22+05:30 IST

దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ దోషి

Batla House encounter: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ మృతి

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్( Indian Mujahideen) ఉగ్రవాది షాజాద్ అహ్మద్ (Shahzad Ahmad) ఢిల్లీలోని ఎయిమ్స్‌(AIIMS)లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ (Batla House encounter)లో ఇన్‌స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ, హెడ్ కానిస్టేబుళ్లు బల్వంత్ సింగ్, రాజ్‌బీర్ సింగ్‌ను కాల్చి చంపిన కేసులో షాజాద్‌ను దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది.

అలాగే, పోలీసు అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్న కేసులోనూ షాజాద్ దోషిగా తేలాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షాజాద్‌ను జనవరి 2023లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందాడు. 19 సెప్టెంబరు 2008 బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో 30 జులై 2013లో షాజాద్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఎన్‌కౌంటర్ తర్వాత తప్పించుకున్న షాజాద్‌ను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కేసును విచారించిన ట్రయల్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ తీర్పుపై అతడు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు అప్పీలు చేసుకున్నాడు. ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలపై సమాచారం అందుకున్నఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బాట్లా హౌస్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా జరిగిన సోదాలు ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. ఢిల్లీలో 13 సెప్టెంబరు 2008న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇదే కేసులో ఆరిజ్‌ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరి శిక్ష విధించింది. అలాగే, రూ. 11 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 10 లక్షలను మోహన్ చాంద్ శర్మ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది.

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్‌కౌంటర్ తర్వాత విభజన రాజకీయాలు మొదలయ్యాయి. బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ను బోగస్‌ ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించేందుకు ఒక వర్గం మీడియా, రాజకీయ నాయకులు ప్రచారం చేశారని అప్పటి ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారి కర్నాల్‌ సింగ్‌ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

Updated Date - 2023-01-28T16:49:18+05:30 IST