Akshara Singh: పీకే 'జన్ సూరజ్'లో భోజ్‌పురి పాపులర్ నటి
ABN , First Publish Date - 2023-11-27T20:12:25+05:30 IST
భోజ్‌పురి నటి, మాజీ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అక్షర సింగ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 'జన్ సూరజ్' ప్రచారంలో చేరారు. ఈ విషయాన్ని అక్షర సింగ్ మంగళవారంనాడు ప్రకటించారు. తనను తాను 'బీహార్ కీ బేటీ'గా ఆమె అభివర్ణించుకున్నారు.
పాట్నా: భోజ్‌పురి నటి, మాజీ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అక్షర సింగ్ (Akshara Singh) ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant kishor) 'జన్ సూరజ్' (Jan Suraaj) ప్రచారంలో చేరారు. ఈ విషయాన్ని అక్షర సింగ్ మంగళవారంనాడు ప్రకటించారు. తనను తాను 'బీహార్ కీ బేటీ'గా ఆమె అభివర్ణించుకున్నారు. పీకే ఆకాంక్షలు, ఆశయాలు తనను ఆకర్షించాయని, రొటీన్ రాజకీయ పార్టీల తరహాలో కాకుండా ఇదొక ఉద్యమమని చెప్పారు.
రాజకీయ ఆకాంక్షలు, గడ్కరితో భేటీపై..
తనకు రాజకీయ ఆకాంక్ష ఉంటే, ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించే దానినని, అన్ని రాజకీయ పార్టీల్లో తన శ్రేయాభిలాషులు చాలా మంది ఉన్నారని అక్షర సింగ్ తెలిపారు. అయితే, అభివృద్ధి (వికసిత్) బీహార్ కల సాకారం కావాలనేది తన కోరికని చెప్పారు. ఈ దిశగా ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో పనిచేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో ఇటీవల సమావేశం కావడంపై మాట్లాడుతూ, ఆయన తనకు తండ్రివంటి వారని, ఎప్పుడూ తాము కలిసినా ఆయన ఎంతో ఆదరణ చూపిస్తారని తెలిపారు. నాగపూర్‌లో ఒక స్టేట్‌షో కోసం వెళ్లినప్పుడు తాము కలుసుకున్నామని, దీంతో బీజేపీలో చేరనున్నట్టు ఊహాగానాలు వచ్చాయని చెప్పారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని వివరించారు.
2024 లోక్‌సభ ఎన్నికలు..
సామాజిక చైతన్యం తెచ్చేందుకు 'జన్ సూరజ్' ఉద్యమ ప్రచారాన్ని పీకే కొద్దికాలం క్రితం చేపట్టారు. బీహార్ వ్యాప్తంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే ప్రచారంలో అక్షర సింగ్ చేరడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ఆమెను ప్రశాంత్ కిషోర్ పోటీలోకి దించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా పీకే మార్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. అదే జరిగితే పీకే పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా అక్షర సింగ్ పోటీలో నిలిచే అవకాశం ఉందంటున్నారు. పార్టీతో నిమిత్తం లేకుండా 'జన్ సూరజ్' ప్రచారానికే పీకే పరిమితమైతే ఆయన మద్దతుతో అక్షర సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగే అవకాశం ఉంది.