Biparjoy Land Fall: గుజరాత్ తీరం తాకిన బిపర్‌జాయ్ తుఫాన్.. అర్థరాత్రి తీరం దాటే అవకాశం
ABN , First Publish Date - 2023-06-15T21:17:45+05:30 IST
సైక్లోన్ బీపర్ జాయ్ గుజరాత్ తీరం చేరింది. మహారాష్ట్ర తీరంలో కూడా తీరం దాటే ప్రక్రియ మొదలైంది. అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందిని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.
అహ్మదాబాద్: సైక్లోన్ బిపర్‌జాయ్ గుజరాత్ తీరాన్ని తాకింది. మహారాష్ట్ర తీరంలో కూడా తీరానికి చేరింది. తీరం దాటే ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు కొనసాగనుందని భారత వాతావరణ శాఖ(IMD)తెలిపింది. ఈదురు గాలుల తీవ్రత గరిష్ఠ స్థాయి గంటకు 125 కిలోమీటర్లకు చేరింది. క్రమంగా ఈ గాలులు నెమ్మదించనున్నాయని అధికారులు వివరించారు. కాగా తీవ్ర వెంట భారీగా వర్షం కురుస్తోంది. కాగా తీవ్ర తుఫాను ముందే పసిగట్టడంతో అధికారులు పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. తీర ప్రాంతాల నుంచి ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. బిపర్‌జాయ్ ప్రభావంతో సబర్మతి రివర్ ఫ్రంట్, ద్వారకాదీష్ ఆలయాన్ని మూసివేశారు.
కొన్ని ప్రాంతాల్లో 25 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు: IMD
బిపర్ జాయ్ తుఫాను తీరం దాటడం ప్రారంభమైంది. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ జిల్లాల్లో అతి భారీ (11.5 సెం.మీ నుండి 20.4 సెం.మీ.) నుండి అత్యంత భారీ (20.5 సెం.మీ కంటే ఎక్కువ) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ గతంలో హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపింది.
గుజరాత్ తీరానికి సమీపంలో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చెట్టు కూలడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. బిపర్‌జాయ్ తుఫాను గురువారం సాయంత్రం కచ్ తీరంలో విధ్వంసకర గాలి వేగం, ఎడతెరిపిలేని వర్షంతో తీరాన్ని తాకింది. కచ్ జిల్లాలోని జఖౌ, మాండ్వి పట్టణాల సమీపంలో విధ్వంసం సృష్టించింది. చాలాచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి.సాయంత్రం 7 గంటల వరకు మరణ వార్తలేమీ లేవని గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ షాంఘ్వీ తెలిపారు.