Rajasthan Politics: రాజస్థాన్‌లో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు.. ఆ అభ్యర్థులపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్
ABN , First Publish Date - 2023-12-02T16:16:02+05:30 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక.. రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు ముగియగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జి పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Exit Poll Changes Rajasthan Politics: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాక.. రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు ముగియగా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జి పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఫలితంగా.. ఆ రాష్ట్రంలో స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు.. ఆ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నామని, తమకే మద్దతు ఇచ్చేలా బుజ్జగింపు చర్యలకు పాల్పడుతున్నారని వార్తలొస్తున్నాయి.
వాస్తవానికి రాజస్థాన్‌లో మొత్తంగా 10 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటిలో 6 ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈసారి రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఆ పార్టీ అక్కడ అధికారంలోకి రావొచ్చని అంచనా వేశాయి. మూడు ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మరోసారి విజయఢంకా మోగిస్తుందని జోస్యం చెప్పాయి. ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని.. హంగ్ అసెంబ్లీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొంది. ఓవరాల్‌గా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే.. రాజస్థాన్‌లో ఈసారి హంగ్ ఏర్పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎవరికైతే మద్దతు తెలుపుతారో.. వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు.
రిపోర్ట్స్ ప్రకారం.. బిజెపి నుండి తిరుగుబాటు చేసిన అభ్యర్థులు 32 మంది ఉండగా, కాంగ్రెస్ నుండి తిరుగుబాటు చేసిన వాళ్లు 22 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. ఈ మొత్తం అభ్యర్థుల్లో సగం మంది గెలిచినా.. వాళ్లే కింగ్ మేకర్స్‌గా అవతరించే అవకాశం ఉంటుంది. అంటే.. ఏ పార్టీతో అయితే కలుస్తారో, ఆ పార్టీనే అధికారంలోకి రావొచ్చు. కేవలం ఈ స్వతంత్ర, తిరుగుబాటు అభ్యర్థులే కారు.. రాజస్థాన్‌లో బీఎస్పీకి 1-2 సీట్లు వస్తాయని, మరికొన్ని చిన్న పార్టీలు కలిసి 8-16 సీట్లు గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చూస్తుంటే.. ఆ చిన్న పార్టీ వాళ్లు కూడా ఈసారి రాజస్థాన్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారేలా కనిపిస్తున్నారు. మరి.. ఫలితాలు ఎలా వస్తాయనేది రేపటి లోగా తేలిపోనుంది.