Uttarakhand: మా ఇంట్లో పెళ్లి మా ఇష్టం...ముస్లిం యువకుడితో కుమార్తె పెళ్లిని సమర్ధించిన బీజేపీ నేత
ABN , First Publish Date - 2023-05-20T18:46:56+05:30 IST
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్‌పాల్ బేనామ్ పై బీజేపీ, వీహెచ్‌పీ, ఇతర రైట్‌వింగ్ సంస్థలు కన్నెర్ర చేశాయి. ఆయన తన కుమార్తెను ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం ఇందుకు కారణం. దీనిపై యశ్‌పాల్ బేనామ్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ''ఇది 21వ శతాబ్దం" అని గుర్తు చేశారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్‌పాల్ బేనామ్ (Yashpal Benam)పై బీజేపీ, వీహెచ్‌పీ, ఇతర రైట్‌వింగ్ సంస్థలు కన్నెర్ర చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి. ఇంతకూ...యశ్‌పాల్‌పై కార్యకర్తల ఆగ్రహం వెనుక కారణం ఏమిటి? ఆయన తన కుమార్తెను ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం, వెడ్డింగ్ కార్డ్ అందరికీ పంపి వివాహ ఏర్పాట్లు చేసుకోవడమే అందుకు కారణం. హిందూ అమ్మాయిని ముస్లిం యువకుడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారని నిరసనకారులు ప్రశ్నిస్తు్న్నారు. దీనిపై యశ్‌పాల్ బేనామ్ శనివారంనాడు ఘాటైన సమాధానం ఇచ్చారు. ''ఇది 21వ శతాబ్దం" అని గుర్తు చేశారు.
''ప్రతి విషయాన్ని బూతద్దంతో చూసే వాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పెళ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇందులో ఇద్దరు యువతీ, యువకుల ప్రమేయం ఉంటుంది. ఈ పరిస్థితిలో మతం అనేది నాకు ప్రధానం కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించాను'' అని ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్‌పాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కాగా, దీనిపై బీజేపీ సభ్యుడు, గో పరిరక్షణ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాము సాంప్రదాయ దుస్తులనే ధరిస్తామని, సంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరిస్తామని చెప్పారు. మన సంస్కృతికి భిన్నంగా ఏది జరిగినా అది తమకు ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి వివాహాలను తాము అంగీకరించమని చెప్పారు. వీహెచ్‌పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ఇలాంటి వివాహాలను తాము అంగీకరించమని చెప్పారు.
యశ్‌పాల్ కుమార్తెను ఒక ముస్లిం యువకుడికి ఇచ్చి మే 28న పెళ్లి చేస్తున్నట్టు వేసిన వెడ్డింగ్ కార్డు గత గురువారంనాడు సోషల్ మీడియాలో వచ్చంది. దీంతో హిందుత్వ వాదులు కొందరు కన్నెర్ర చేశారు. యశ్‌పాల్ ప్రస్తుతం పౌరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. కాగా, లక్నో యూనివర్శిటీలో చదువుతున్న యశ్‌పాల్ కుమార్తె ముస్లిం యువకుడిని ప్రేమించిందని, వివాహం చేసుకోవాలని ఉభయులూ నిర్ణయించుకున్నారని యశ్‌పాల్ సన్నిహితులు తెలిపారు. యశ్‌పాల్ తన కుమార్తె వివాహానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలను సైతం ఆహ్వానించారు.