Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

ABN , First Publish Date - 2023-09-17T16:26:04+05:30 IST

సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ''పీఎం విశ్వకర్మ'' అనే కొత్త పథకాన్ని ఆదివారంనాడు 'విశ్వకర్మ జయంతి' సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

న్యూఢిల్లీ: సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ''పీఎం విశ్వకర్మ'' (PM Vishwakarma) అనే కొత్త పథకాన్ని ఆదివారంనాడు 'విశ్వకర్మ జయంతి' (Vishwakarma Jayanti) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు, శతాబ్దాల నాటి సంప్రదాయాలు, సంస్కృతిని సజీవం చేసి, స్థానిక ఉత్పత్తులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉద్దేశించారు. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన విశ్వకర్మ పార్టనర్స్‌ను గుర్తించి, వారికి అన్ని విధాలా చేయూతనందించనున్నామని చెప్పారు. విశ్వకర్మ పార్టనర్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ పథకం కింద 18 వేర్వేరు రంగాల వారి అభ్యున్నతికి కృషి చేయనున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకం కింద ప్రభుత్వం రూ.13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని తన 73వ జన్మదినోత్సవమైన ఆదివారంనాడు ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషం.


ప్రధాన మంత్రి మోదీ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం విశ్వకర్మ స్కీమ్‌ను ప్రకటించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, రూ.13,000 కోట్లతో ఈ స్కీమ్ తీసుకువస్తున్నామన్నారు. ఈ పథకం కింద బయో మెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్‌ను ఉపయోగించుకుని కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్ధిదారులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


'పథకం' వివరాలు..

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డు ఇస్తారు. నైపుణ్యతలను పెంచేందుకు బేసిక్, అడ్వాన్స్‌డ్ శిక్షణ కల్పిస్తారు. రూ.15,000 విలువైన టూల్‌కిట్ ఇన్సెన్టివ్, రూ.లక్ష వరకూ (first trache) కొలేటరల్-క్రెడిట్ సపోర్ట్, 5 శాతం కన్సెషనల్ వడ్డీరేటుతో రూ.2 లక్షల వరకూ (second trache) క్రెడిట్ సపోర్ట్ ఇస్తారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు. దేశీయ మార్కెట్‌తో పాటు, గ్లోబల్ వాల్యూ పెరిగేలా కళలు, కళాకారులను ప్రోత్సహిస్తారు.


స్కీమ్ పరిధిలోకి 18 వృత్తులవారు..

18 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్‌ను ఈ స్కీమ్ పరిధిలోకి తెస్తున్నారు. వడ్రంగిపనివారు (కార్పెంటర్లు), పడవల తయారీదారులు, ఆర్మౌరెర్, కమ్మరి, హ్యామర్ అండ్ టూల్ కిట్ మేకర్లు, తాళాల తయారీదారులు, కుండల తయారీదారులు, శిల్పకారులు, రాళ్లు కొట్టేవారు, చెప్పులుకుట్టేవారు, తాపీమేస్త్రీలు, బుట్టలు, తివాసీలు, చీపుర్ల తయారీదారులు, కాయిర్ నేత కార్మికులు, ఆటబొమ్మల తయారీదారులు, క్షురకులు, దండల తయారీదారులు, రజకులు, టైలర్లు, చేపల వలల తయారీదారులు ఈ స్కీమ్ కిందకు వస్తారు. సంప్రదాయకంగా ఓబీసీలే ఎక్కువగా ఈ వృత్తులలో కొనసాగుతుంటారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, ఈ ఏడాది చివర్లో నాలుగైదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'పీఎం విశ్వకర్మ పథకం' ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-09-17T16:26:04+05:30 IST