Share News

MP State Assembly elections : చావో రేవో!

ABN , First Publish Date - 2023-11-12T05:02:29+05:30 IST

మధ్యప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరుగుతున్నాయి. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రె్‌సలు చావోరేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. విజయమే లక్ష్యంగా.. ఎత్తులు పైఎత్తులతో

MP State Assembly elections : చావో రేవో!

మధ్యప్రదేశ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ ఢీ అంటే ఢీ.. ఎత్తుకు పైఎత్తులు

కమల్‌నాథ్‌పైనే ‘హస్తం’ ఆశలు

స్థానిక నాయకత్వానికే బాధ్యతలు

కమలానికి మోదీయే ప్రచార సారథి

సీఎం చౌహాన్‌ను పక్కనపెట్టి తెరపైకి ఉమ్మడి నాయకత్వం

అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు

మొత్తం స్థానాలు: 230

బీజేపీ 128

కాంగ్రెస్‌ 98

బీఎస్పీ 1

స్వతంత్రులు 3

మధ్యప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరుగుతున్నాయి. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రె్‌సలు చావోరేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. విజయమే లక్ష్యంగా.. ఎత్తులు పైఎత్తులతో ప్రచార పర్వం రసవత్తరంగా మారింది. 230 స్థానాల అసెంబ్లీకి ఈనెల 17న ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రం లో గత ఎన్నికల్లో 114సీట్లలో విజయం సాధించి స్వతంత్రుల మద్దతుతో కమల్‌నాథ్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినా.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15నెలలకే కుప్పకూలింది. ఈసారి సంపూర్ణ మెజారిటీతో గద్దెనెక్కాలని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ పట్టుదలతో ఉన్నారు. స్థానిక నాయకత్వమే ఈసారి గెలిపిస్తుందని అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ గట్టిగా విశ్వసిస్తున్నారు. సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, కాంతిలాల్‌ భూరియా, అజేయసింగ్‌, అరుణ్‌ యాదవ్‌ తదితరులు కమల్‌నాథ్‌కు మద్దతిస్తున్నా టికెట్ల పంపిణీలో మాత్రం తమ మాట నెగ్గించుకున్నారు.

దీంతో పలు చోట్ల అసంతృప్తి పెల్లుబికింది. బీజేపీ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఆ పార్టీలోనూ టికెట్ల పంపిణీ చిచ్చురేగింది. 16 ఏళ్లుగా సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దాదాపు పక్కనపెట్టేశారు. సమష్టి నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. అయితే చౌహాన్‌పై రాష్ట్ర ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది. మహిళల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ‘లాడ్లీ బెహనా యోజన’ ఆయనకు ‘మామ’ అనే పేరును సార్థకం చేశాయి. ఇది గ్రహించిన మోదీ-షా ఎట్టకేలకు ఆయనకు టికెట్‌ ఇచ్చినా సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. సమష్టి నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్ర మం త్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌, ఫగన్‌సింగ్‌ కులస్తే సహా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించారు. ఇక మోదీయే ఆ పార్టీ ప్రధాన ప్రచారకర్త. 3నెలలుగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్‌లోపు 10-11 ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సంక్షేమంపైనే ఉభయ పార్టీల ఆశలు..

కాంగ్రెస్‌, బీజేపీలు ఉచిత సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. కర్ణాటకలో 5 ఉచిత గ్యారెంటీ హామీలతో కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్‌నూ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ప్రతి నెలా మహిళలకు రూ.1,500, స్కూల్‌ విద్యార్థులకు రూ.500-1,500, గోధుమ, వరి పంటలకు మద్దతు ధర పెంపు, అందరికీ ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27ు కోటా, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌) అమలు వంటి హామీలతో ముందుగానే మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక సీఎం చౌహాన్‌.. వెం టనే ఉచితాలకు మరిన్ని మెరుగులుదిద్దారు. ‘లాడ్లీ బెహనా యోజన’ కింద మహిళలకు నెలకు ఇస్తున్న రూ.1,000 అలవెన్సును రూ.1,250కి పెంచారు. ఎన్నికల తర్వాత 1,500కి.. ఆ తర్వాత రూ.3వేలకు పెంచుతానని ప్రకటించారు. పథకం వయో పరిమితిని 23 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించారు.

ఓబీసీ సర్వే ప్రభావం తక్కువే!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కొన్ని రోజుల్లో ప్రకటిస్తారనగా.. బిహార్‌ ప్రభుత్వం కులగణన సర్వేను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్‌ వెంటనే దేశవ్యాప్తంగా ఓబీసీ సర్వే చేపట్టాలని మోదీ సర్కారును డిమాండ్‌ చేయడం మొదలుపెట్టింది. ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తే సర్వే చేపడతామని రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఎన్నికల సభల్లో ప్రకటిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సగానికిపైగా ఓబీసీలే అయినా.. కులగణన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ డిమాండ్‌ రాష్ట్రంలో ఇంతవరకు పెద్దగా ఊపందుకోలేదు. ఈ వ్యవహారంలో బీజేపీ పూర్తి మౌనం పాటిస్తోంది. మోదీ మాత్రం కాంగ్రె్‌సపై విరుచుకుపడుతున్నారు. సమాజాన్ని కులాలపేరిట చీల్చాలని చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

రూ.450కే సిలిండర్‌

వరి, గోధుమకు అధిక ఎమ్మెస్పీ

పేద బాలికలకు పీజీ దాకా ఉచిత విద్య

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మేనిఫెస్టో

భోపాల్‌, నవంబరు 11: గోధుమలు క్వింటాలు కు రూ.2,700, క్వింటాలు వరి ధాన్యానికి రూ.3,100 చొప్పున కనీస మద్దతు ధర కల్పిస్తామ ని, ‘లాడ్లీ బెహ్నా’ పథకం కింద ఇళ్లు ఇస్తామని బీజేపీ ఎన్నికల హామీలు గుప్పించింది. లాడ్లీ బెహ్నా, పీఎం ఉజ్వల పథకాల లబ్ధిదారులకు రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని పేర్కొంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప్‌ పత్ర’ (విజన్‌ డాక్యు మెంట్‌)ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విడుదల చేశారు. పేద బాలికలకు పీజీ వరకు, 12వ తరగతి వరకూ పేద విద్యార్థులకు ఉచిత విద్య, ప్రతి కుటుంబం లో కనీసం ఒకరికి ఉద్యోగం లేదా స్వయం ఉపా ధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. గిరిజ న వర్గాల సాధికారత కోసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌ వంటి హామీలను బీజేపీ ప్రకటించింది.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2023-11-12T05:03:54+05:30 IST