Share News

Money : కట్టలు కుక్కేశారు!

ABN , First Publish Date - 2023-12-09T04:16:55+05:30 IST

ఆఫీసులు, ఇళ్లు.. ఇలా ఎటు చూసినా నోట్ల కట్టలే. బీరువాలు, అల్మరాలు, పడకగదులు.. ఎందెందు వెతికినా

 Money : కట్టలు కుక్కేశారు!

బీరువాలు.. అల్మరాలు.. సహా అంతటా నోట్ల కట్టలే

లిక్కర్‌ కంపెనీల పన్ను ఎగవేత కేసులో స్వాధీనం

చేసుకున్న ఐటీ.. జార్ఖండ్‌, ఒడిసాల్లో దాడులు

భువనేశ్వర్‌/రాంచీ, డిసెంబరు 8: ఆఫీసులు, ఇళ్లు.. ఇలా ఎటు చూసినా నోట్ల కట్టలే. బీరువాలు, అల్మరాలు, పడకగదులు.. ఎందెందు వెతికినా కట్టలకు కట్టల సొమ్ము బయటపడింది! దేశంలోనే అతిపెద్ద లిక్కర్‌ తయారీ కంపెనీ ఒడిసాలోని బాల్దేవ్‌ సాహు గ్రూప్‌ పన్నుల ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారులు ఒడిసా, జార్ఖండ్‌ రాష్ట్రాలు, కొల్‌కతాలలో జరిపిన దాడుల్లో ఈ నోట్ల కట్టలు వెలుగు చూశాయి గత మూడు రోజులుగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు పట్టుబడిన సొమ్మును సంచుల్లో కుక్కగా.. ఏకంగా 156 గోనె సంచులు నిండిపోయాయి. వీటిని 36 కరెన్సీ మిషన్లతో లెక్కించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం వరకు రూ.250 కోట్లను మాత్రమే లెక్కించారు. లెక్కింపు కొనసాగుతోందని, దాడులు కూడా కొనసాగుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి.

ఇది మోదీ గ్యారెంటీ: ప్రధాని

తాజా ఐటీ దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తామని పేర్కొన్నారు. ‘‘ప్రజలారా ఈ నోట్లకట్టల వంక ఒకసారి దృష్టి పెట్టండి. నీతి వాక్యాలు పలికే నాయకుల చేష్టలు తెలుసుకోండి. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసాను రాబడతాం. ఇది మోదీ గ్యారెంటీ!’’ అని ఒడిసా, జార్ఖండ్‌ నాయకులను ఉద్దేశించి ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. దీనికి హిందీ దినపత్రికలో వచ్చిన ‘నోట్ల కట్టల’ ఫొటోను ప్రధాని జోడించారు.

Updated Date - 2023-12-09T04:16:57+05:30 IST