Bus Fall into gorge: లోయలో దొర్లిపడిన బస్సు...ఇద్దరు దుర్మరణం
ABN , First Publish Date - 2023-04-02T17:28:20+05:30 IST
ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి-డెహ్రాడూన్ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఐటీబీబీ క్యాంపు సమీపంలో..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarkhand)లోని ముస్సోరి-డెహ్రాడూన్ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఐటీబీబీ క్యాంపు సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు 70 అడుగుల లోతైన లోయలో పడటంతో ఇద్దరు మృతిచెందారు. ప్రయాణికులంతా గాయపడినట్టు ముస్సోరి పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. బస్సు దుర్ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. క్షతగాత్రుల చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కాగా, బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో సహా బస్సులోని 22 మంది గాయపడ్డారని, సహాయక కార్యక్రమాలు చేపట్టామని, ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ముస్సోరి పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే మరణించారని చెప్పారు. జేపీ బెండ్ సమీపంలో బస్సు మలుపు తిరుగుతూ లోయలో పడిందని ఐటీబీబీ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.