LPG Prices: ఎల్‌పీజీ ధర రూ.200 తగ్గింపు..
ABN , First Publish Date - 2023-08-29T17:24:00+05:30 IST
వంటగ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు.
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలెండర్ (LPG) ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurga Thakur) మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజా తగ్గింపుతో పీఎం ఉజ్వల యోజన (PMUY) కింద పంపిణీ చేసే సిలెండర్లపై సబ్సిడీ రూ.400కు పెరిగింది. ఉజ్వల స్కీమ్ కింద గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండర్లను ఏడాదికి 12 వరకూ తీసుకోవచ్చు. 14.2 కిలోల ఎల్పీజీ సిలెండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,103గా ఉందని ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది.
ప్రధాని 'రాఖీ' పండుగ కానుక
డొమిస్టిక్ ఎల్‌పీజీ సిలెండర్ల ధర రూ.200 తగ్గించాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారని, రక్షాబంధన్ కానుకగా దేశంలోని మహిళలందరికీ మోదీ ఇచ్చిన కానుక ఇదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 5 రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడం ప్రాధాన్యత సంతరించుకుంది.