Cancer: క్యాన్సర్‌పై తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..!
ABN , First Publish Date - 2023-09-07T01:28:02+05:30 IST
యాభై ఏళ్ల లోపు వ్యక్తుల్లో క్యాన్సర్ పెరుగుతోందని ఒక అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. గత 30 ఏళ్లలో వీరిలో క్యాన్సర్ కేసులు 79ు మేర పెరిగాయని తెలిపింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
గత ముప్పై ఏళ్లలో 79% పెరుగుదల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: యాభై ఏళ్ల లోపు వ్యక్తుల్లో క్యాన్సర్ (Cancer)పెరుగుతోందని ఒక అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. గత 30 ఏళ్లలో వీరిలో క్యాన్సర్ కేసులు 79ు మేర పెరిగాయని తెలిపింది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్ల వయసులోపు వారిలో 1990లో 18.2 లక్షల క్యాన్సర్ కేసులు నమోదుకాగా 2019లో వాటి సంఖ్య 32.6 లక్షలుగా నమోదైంది. కేసుల విషయంలోనే కాకుండా, మరణాలలో కూడా 28 శాతం పెరుగుదల ఉందని వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా భారత్‌తోపాటు 204 దేశాల్లో 29 రకాల క్యాన్సర్ల బారిన పడిన వారి వివరాలను పరిశీలించారు. 2019లో రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా నమోదయ్యాయని, అయితే, 1990 నుంచి శ్వాసనాళ, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోయాయని ఈ అధ్యయనం వెల్లడించింది. మరోవైపు, హెపటైటి్‌స-బి వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరగటం వల్ల లివర్ క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పెరిగిపోయి అది లివర్ క్యాన్సర్‌కు దారి తీయటం అధికమైందని పేర్కొంది. 2030 నాటికి క్యాన్సర్ కేసులు 31 శాతం, మరణాలు 21 శాతం పెరగవచ్చని, 40 ఏళ్లలోపు వారిలో రిస్క్ ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది. మద్యపానం, ధూమపానం, మాంసాహారం, ఉప్పు అధికంగా తీసుకోవటం, పాలు, పళ్లు తక్కువగా తీసుకోవటం వంటి వాటితో 50 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ ముప్పు అధికమని తెలిపింది. జన్యుసంబంధమైన కారణాల వల్ల కూడా ముప్పు ఉంటుందని వెల్లడించింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవటం వల్లనే క్యాన్సర్ నుంచి ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.