CEC, ECs : మరో వివాదాస్పద బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-08-10T13:23:35+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.

CEC, ECs : మరో వివాదాస్పద బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు (నియామకం, సర్వీస్ నిబంధనలు, పదవీ కాలం) బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వీరిని నియమించేందుకు ఏర్పాటయ్యే కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని తొలగిస్తారు. సీజేఐకి బదులుగా ప్రధాన మంత్రి నియమించే కేంద్ర మంత్రి ఈ కమిటీలో ఉంటారు. అంటే ఈ బిల్లు చట్టంగా మారి, అమల్లోకి వస్తే, ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, ప్రధాన మంత్రి నియమించే కేంద్ర మంత్రి సమావేశమై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసి, రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.


ఇదిలావుండగా, సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన రూలింగ్‌లో, ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి కలిసి చేసిన సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని తెలిపింది. చట్టబద్ధ పాలనను హామీగా ఇవ్వని ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని జస్టిస్ జోసఫ్ ఈ తీర్పులో చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు విస్తృతాధికారాలు ఉన్నాయని, వాటిని చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేస్తే, రాజకీయ పార్టీల ఫలితాలపై ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉండాలన్నారు. తాను స్వతంత్ర వ్యవస్థనని చెప్పుకుంటూ, అనుచిత రీతిలో కార్యకలాపాలను నిర్వహించకూడదని తెలిపారు. రాజ్యానికి కట్టుబడే వ్యక్తికి స్వతంత్ర మానసి స్థితి ఉండకూడదన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.

భారత ఎన్నికల కమిషన్‌లో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. వీరిలో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. వీరిని రాజ్యాంగంలోని అధికరణ 324(2) ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.


ఇవి కూడా చదవండి :

Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు

No-confidence motion : అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం మరి కాసేపట్లో

Updated Date - 2023-08-10T13:23:35+05:30 IST