Chandrayaan-3: కీలక ఘట్టం పూర్తి చేసుకున్న చంద్రయాన్-3.. తర్వాతి అడుగు జాబిల్లిపైనే..!
ABN , First Publish Date - 2023-08-20T09:29:05+05:30 IST
యావత్ భారతదేశంతోపాటు ప్రపంచదేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mission) అత్యంత కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మిషన్‌లో రెండవది, చివరిదైన డీ-బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం వేకువజామున విజయవంతంగా పూర్తిచేసుకుందని ఇస్రో ప్రకటించింది. మిషన్ అత్యంత కీలకమైన దశలో ఉండడంతో అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తల వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: యావత్ భారతదేశంతోపాటు ప్రపంచదేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mission) అత్యంత కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మిషన్‌లో రెండవది, చివరిదైన డీ-బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం వేకువజామున సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసుకుందని ఇస్రో ప్రకటించింది.
దీంతో చంద్రుడికి కనిష్ఠంగా 25 కిలోమీటర్లు, గరిష్ఠంగా 134 కిలోమీటర్ల దూరం కక్ష్యలోకి ల్యాండర్ విక్రమ్ ప్రవేశించింది. ఈ పాయింట్ నుంచే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ విక్రమ్ ప్రయత్నించనుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై జరిగే ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం జరగనుందని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ట్విటర్ వేదికగా ఇస్రో ప్రకటన చేసింది. ‘‘ రెండవ, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో మిషన్ కక్ష్య 25 x 134 కిలోమీటర్లకు తగ్గింది. మాడ్యుల్‌లో అంతర్గత పరిశీలనలు జరుగుతాయి. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించే ప్రాంతంలో సూర్యోదయం కోసం వేచిచూడాల్సి ఉంటుంది. 23 ఆగస్టు 2023న భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఈ కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుందని భావిస్తున్నాం’’ అని ఇస్రో పేర్కొంది. కాగా మిషన్ అత్యంత కీలకమైన దశలో ఉండడంతో అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తల వర్గాలు వెల్లడించాయి.