Chandrayaan-3: యావత్ దేశం చంద్రయాన్-3 గురించి మాట్లాడుతుండగా.. అసలు పని మొదలుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్

ABN , First Publish Date - 2023-08-24T11:45:13+05:30 IST

చంద్రుడిపై ల్యాండింగ్ ఒక కీలక ఘట్టం మాత్రమే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సింది చాలా ఉంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బుధవారం వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇస్రో (ISRO) ట్విటర్ వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చింది.

Chandrayaan-3: యావత్ దేశం చంద్రయాన్-3 గురించి మాట్లాడుతుండగా.. అసలు పని మొదలుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్

బెంగళూరు: దాదాపు 140 కోట్ల మంది భారతీయుల నమ్మకాన్ని నెలబెడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తల శ్రమకు ఫలితానిస్తూ చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3) ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధ‌ృవానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా చరిత్ర సృష్టించిన ఈ అద్భుత ఘట్టం బుధవారం సాయంత్రం 6.04 గంటల సమయంలో ఆవిష్కృతమైంది. దీంతో యావత్ దేశం పులకించిపోయింది.


ఇదిలావుండగా చంద్రుడిపై ల్యాండింగ్ ఒక కీలక ఘట్టం మాత్రమే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సింది చాలా ఉంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బుధవారం వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇస్రో (ISRO) ట్విటర్ వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చింది.

‘‘ చంద్రయాన్-3 రోవర్: జాబిల్లి కోసం భారత్‌లో తయారయ్యాను!. చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి సాఫీగా దిగింది. చందమామపై భారత్ నడక సాగించింది!’’ అంటూ ప్రజ్ఞాన్ రోవర్ నుంచి సమాచారం అందిందని ట్విటర్‌లో ఇస్రో వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఉంటాయని తెలిపింది.

ఇక ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ల్యాండర్, రోవర్ పనితీరు అద్భుతంగా ఉన్నాయన్నారు. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ ల్యాండర్ కిందికి దిగింది. అతిత్వరలోనే రెండు ఫొటోలు పంపించే అవకాశం ఉందని వివరించారు.

మైనస్‌ 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో..

భూమ్మీద ఒక పగలు 12 గంటలు. కానీ, చంద్రుడి మీద 14 రోజులు. అంటే 14 రోజులు పూర్తిగా వెలుగు. తర్వాత చీకటి. సోలార్‌ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొందే విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై పడే సూర్యరశ్మితో పనిచేస్తాయి. అది ఆగిపోయాక చంద్రుడిపై చీకటి నెలకొని ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఈ వ్యవధిలో మనుగడ కష్టమే. అయితే, 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక.. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ సూర్యరశ్మి పడి తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది. ముఖ్యంగా ల్యాండర్‌ విక్రమ్‌ యాక్టివేట్‌ అయితేనే భూమికి సంకేతాలు చేరతాయి.

Updated Date - 2023-08-24T16:47:56+05:30 IST