Omar Abdullah: ధైర్యం ఉంటే రాజ్యాంగాన్ని మార్చండి చూద్దాం..

ABN , First Publish Date - 2023-09-08T14:25:06+05:30 IST

'భారత్-ఇండియా' పేరుకు సంబంధించి చెలరేగిన వివాదంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని సవాలు చేశారు. కేంద్రానికి ధైర్యం ఉంటే ముందు రాజ్యాంగాన్ని మార్చాలని ఛాలెంజ్ చేశారు.

Omar Abdullah: ధైర్యం ఉంటే రాజ్యాంగాన్ని మార్చండి చూద్దాం..

శ్రీనగర్: 'భారత్-ఇండియా' (Bharat-India) పేరుకు సంబంధించి చెలరేగిన వివాదంపై నేషనల్ కాన్ఫరెన్స్ (National conference) నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కేంద్రాన్ని సవాలు చేశారు. కేంద్రానికి ధైర్యం ఉంటే ముందు రాజ్యాంగాన్ని మార్చాలని ఛాలెంజ్ చేశారు. దేశం పేరు మార్చేందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఏ ఒక్కరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


''ఎవరూ పేరు మార్చలేరు. ఒక దేశం పేరు మార్చడం అంత సులువు కాదు. ఆ పని చేయాలంటే దేశ రాజ్యాంగాన్ని మార్చాలి. మీకు ధైర్యం ఉంటే చేయండి. మీకు ఎవరు మద్దతిస్తారో మేము కూడా చూస్తాం'' అని ఒమర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత రాష్ట్రపతి తరఫున జి-20 విందుకు హాజరయ్యే అతిథులకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో దేశం పేరు 'భారత్' అని ఉండటంతో దేశం పేరు మారనుందనే ఊహాగానాలకు తావిచ్చింది.


విపక్ష కూటమి పేరు ఇండియా (I.N.D.I.A.) కావడంతో ప్రభుత్వం ఈ డ్రామాలకు తెరతీసిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ చర్యను బీజేపీ నేతలు బలంగా సమర్ధిస్తున్నారు. ఈ పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఫరూక్ అబ్దుల్లా సైతం శుక్రవారం స్పందించారు. ''ముందు రాజ్యాంగాన్ని చదవండి. భారత్, ఇండియా రెండూ ఒకటే అని అందులో ఉంటుంది. మీరు (మీడియా) వివాదం సృష్టిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

Updated Date - 2023-09-08T14:25:06+05:30 IST