Share News

Chat GPT : చాట్‌ జీపీటీ సీఈఓ తొలగింపు

ABN , First Publish Date - 2023-11-19T02:49:37+05:30 IST

ఇంటర్నెట్‌ సంచలనం చాట్‌ జీపీటీ యాజమాన్య సంస్థ ‘ఒపెన్‌ ఏఐ’లో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌, సహ

Chat GPT  : చాట్‌ జీపీటీ సీఈఓ తొలగింపు

గూగుల్‌ మీట్‌లో ఒపెన్‌ ఏఐ బోర్డు సంచలన నిర్ణయం

తాత్కాలిక సీఈవోగా మీరా మురాటి నియామకం

వాషింగ్టన్‌, నవంబరు 18: ఇంటర్నెట్‌ సంచలనం చాట్‌ జీపీటీ యాజమాన్య సంస్థ ‘ఒపెన్‌ ఏఐ’లో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌, సహ వ్యవస్థాపకుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌లను బోర్డు నుంచి తొలగిస్తూ ఒపెన్‌ ఏఐ హఠాత్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై సామ్‌, గ్రెగ్‌ విస్మయాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే, తమకు భిన్నవర్గాల నుంచి భారీ ఎత్తున లభిస్తున్న మద్దతుపై వారు హర్షం వెలిబుచ్చారు. తనను ఒపెన్‌ ఏఐ నుంచి తొలగించటంపై సామ్‌ ఆల్ట్‌మన్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ రోజు కలిగిన అనుభవం పలు విధాలుగా భిన్నమైనది. ఒక వ్యక్తి బతికి ఉండగానే అతడికి సంతాప సందేశాన్ని చదివి వినిపించినట్లుగా ఉంది. అయితే, నాపై కురుస్తున్న ప్రేమాభిమానాలు మాత్రం ఓదార్పునిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. సామ్‌ ఆల్ట్‌మన్‌ను తొలగించటంపై ఒపెన్‌ ఏఐ ఒక ప్రకటన చేసింది.

కంపెనీ బోర్డుతో సామ్‌ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపటం లేదని, తద్వారా బోర్డు తన బాధ్యతలను నెరవేర్చటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపింది. సామ్‌ ఆల్ట్‌మన్‌ స్థానంలో కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మీరా మురాటిని తాత్కాలిక సీఈవోగా నియమిస్తున్నట్లు పేర్కొంది. కృత్రిమ మేధను కొత్తగా పరిచయం చేస్తూ చాట్‌ జీపీటీను సృష్టించిన 38 ఏళ్ల సామ్‌ ఆల్ట్‌మన్‌ టెక్‌ ప్రపంచం తాజా సంచలనంగా నిలిచారు. ఆయన ఆకస్మిక తొలగింపు ఒపెన్‌ ఏఐపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Updated Date - 2023-11-19T02:49:47+05:30 IST