Share News

Typhoon Michoung Chennai : చెన్నై జలదిగ్బంధం

ABN , First Publish Date - 2023-12-05T03:16:53+05:30 IST

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమైపోయింది.

Typhoon Michoung Chennai : చెన్నై జలదిగ్బంధం

చెన్నై, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమైపోయింది. సోమవారం రాత్రి వరకు నిరాటంకంగా వర్షం కురవడంతోపాటు, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కూడా వస్తుండటంతో చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో జనజీవనం స్తంభించిపోయింది. టీనగర్‌, కోడంబాకం, లింగంబాకం, ప్యారిస్‌, మైలాపూర్‌ తదితర ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక శివారు ప్రాంతాల్లో నడుము లోతుకుపైగా వర్షం నీరు ప్రవహిస్తోంది. ఇళ్లలోకీ నీరు చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం తిరువళ్లూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతిచ్చింది. పైవ్రేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని, వారిని కార్యాలయాలకు పిలవరాదని ఆదేశాలు జారీ చేసింది.

స్తంభించిన రవాణా...

తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. మెట్రోపాలిటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సులను మొత్తం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పైవ్రేటు, ప్రభుత్వ వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చెన్నై సెంట్రల్‌, ఎగ్మోర్‌, తాంబరం ప్రాంతాల నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిన 50కిపైగా రైళ్లను రద్దు చేశారు. బయటి ప్రాంతాల నుంచి చెన్నైకి రావాల్సిన రైళ్లను కూడా మార్గంమధ్యలోనే నిలిపివేసినట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయ రన్‌వే నీటితో నిండిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా వరద నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. చెన్నై నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు.

చెన్నైలో అంధకారం..

ఈదురుగాలులకు విద్యుత్‌ లైన్లు తెగిపడడంతో చెన్నై నగరం మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. సోమవారం వేకువజాము నుంచి రాత్రి పొద్దుబోయే వరకు ఎక్కడా విద్యుత్‌ సరఫరా లేదు. దీంతో విద్యుత్‌పై ఆధారపడిన పలు పరిశ్రమలు మూతపడ్డాయి. మొబైల్‌ ఫోన్లు సైతం చార్జింగ్‌ లేక స్విచ్‌ఆ్‌ఫ కావడంతో తమ బంధువులకు ఏమైందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. పలుచోట్ల టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో మొబైల్‌ ఫోన్లకు సిగ్నల్‌ సమస్య కూడా ఏర్పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు ఫోన్‌ చేసి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధమని చెప్పారు.

Updated Date - 2023-12-05T03:56:39+05:30 IST