Chief Minister: డీఎంకే పాలనలోనే తమిళ సాహిత్యానికి పట్టం

ABN , First Publish Date - 2023-01-07T08:22:25+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ హయాంలోనే తమిళ సాహిత్యం అభివృద్ధి చెంది నలుదిశలా వ్యాప్తి చెందుతుందని ముఖ్యమంత్రి

Chief Minister: డీఎంకే పాలనలోనే తమిళ సాహిత్యానికి పట్టం

- ఇకపై జిల్లాల వారీగా సాహితీ ఉత్సవాలు

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

చెన్నై, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ హయాంలోనే తమిళ సాహిత్యం అభివృద్ధి చెంది నలుదిశలా వ్యాప్తి చెందుతుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మూడు రోజుల తమిళ సాహితీ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన పలువురు రచించిన 100 పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. తన ఏడాదిన్నరగా డీఎంకే(DMK) ప్రభుత్వ పాలనలో తమిళసాహిత్యానికి ఎనలేని సేవలందించామన్నారు. మనిషిని సంస్కారవంతుడిని చేసేది సాహిత్యమేనని, తమిళభాష సాహిత్యాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలర్పించింది తమిళ జాతి అని పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం రాజకీయ ఉద్యమమే అయినా, తమిళభాషా పరిరక్షణకు, తమిళ సాహిత్య అభివృద్ధికోసం ఆందోళనలు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ సాహిత్యం కోసం, భాష కోసం ఎలాంటి ఉద్యమాలు చేయలేదని, తమిళనాట ఇలాంటి ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించిన ఘనత డీఎంకేకు చెందుతుందన్నారు. ‘వాడిన పంటను చూసినప్పుడల్లా వాడిపోయాను’ అంటూ రామలింగ అడిగళార్‌ రచించిన పాట మానవుడి కరుణార్ద్ర హృదయాన్ని చాటిచెబుతుందన్నారు. తమిళుల ప్రాచీన సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే సాహిత్యాలను నేటి యువత చదవాలని పిలుపునిచ్చారు. తమిళ సాహితీ ఉత్సవాలను జిల్లాలవారీగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపడతామని సభికుల హర్షధ్వానాల మధ్య స్టాలిన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అన్బిల్‌ మహేష్‌, పీకే శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్ కుమార్‌, పాఠ్యపుస్తకాల ప్రచురణ సంస్థ అధ్యక్షుడు దిండుగల్‌ ఐలియోని, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉషా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఇలంభగవత్‌, ప్రముఖ రచయితలు పాల్‌ చక్కారియా, బవా చెల్లదురై తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T08:22:26+05:30 IST