Meerat: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన స్నేహితులు
ABN , First Publish Date - 2023-11-27T11:25:56+05:30 IST
తోటి విద్యార్థిపై స్నేహితులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడం ఉత్తర ప్రదేశ్(Uttarpradesh) లో కలకలం రేపింది.
లఖ్ నవూ: తోటి విద్యార్థిపై స్నేహితులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడం ఉత్తరప్రదేశ్(Uttarpradesh) లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్(Meerut)లో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని తోటి స్నేహితులు నవంబర్ 13న కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తరువాత ఒకరి తరువాత ఒకరు బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
అంతటితో ఆగకుండా మూత్ర విసర్జన చేశారు. దాడి చేయొద్దని బాధితుడు ఎంత బతిమాలినా నిందితులు వినలేదు. విద్యార్థి తలపై, వీపుపై విచక్షణరహితంగా కొట్టారు. మరొకడు బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. ఈ దారుణ దృశ్యాల్ని పక్కనే ఉన్న మరి కొందరు స్నేహితులు వీడియోలు తీశారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి చేరింది. పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అందులో అశిష్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అశిష్ తో సహా మిగతా ముగ్గురిని అవి శర్మ, రాజన్, మోహిత్ ఠాకూర్‌గా గుర్తించారు. యువకుడిపై దాడి చేసి మూత్ర విసర్జన చేశారని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పీయూష్ సింగ్ తెలిపారు. తమ బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా కుమారుడిని కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలో దాడి చేసినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది.
మరుసటి రోజు ఉదయం బాధితుడు ఇంటికి చేరుకుని జరిగిన ఘటనను వివరించాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లెంట్ చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదట్లో వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. 3 రోజుల తరువాత సదరు వీడియో వైరల్ కావడంతో వారిలో కదలిక వచ్చిందని తండ్రి ఆరోపించారు. దాడి చేసిన వారిలో కొందరు స్నేహితులు ఉన్నారని.. అయితే వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.