CM MK Stalin: ఆ మాటల్లో తప్పేముంది?
ABN , First Publish Date - 2023-09-08T02:50:27+05:30 IST
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. సనాతన ధర్మం బోధించే అమానుష సూత్రాలపై ఉదయనిధి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఎస్సీ, ఎస్టీలు, మహిళల పట్ల వివక్ష చూపే సనాతన సూత్రాలపైనే ఆయన తన అభిప్రాయాలను చెప్పారని.. అంతేతప్ప ఏ మతాన్నీ, మత విశ్వాసాలను కించపరచలేదని గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై వివక్షను
ఎత్తిచూపడం తప్పా: స్టాలిన్
స్వామీజీ దిష్టిబొమ్మల దహనం వద్దు
డీఎంకే కార్యకర్తలకు ఉదయనిధి పిలుపు
చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. సనాతన ధర్మం బోధించే అమానుష సూత్రాలపై ఉదయనిధి కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఎస్సీ, ఎస్టీలు, మహిళల పట్ల వివక్ష చూపే సనాతన సూత్రాలపైనే ఆయన తన అభిప్రాయాలను చెప్పారని.. అంతేతప్ప ఏ మతాన్నీ, మత విశ్వాసాలను కించపరచలేదని గురువారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. పుట్టుక ఆధారంగా వివక్షను సమర్థించే తిరోగమన వర్ణాశ్రమ మనువాద సనాతన భావజాలానికి వ్యతిరేకంగా పెరియార్, మహాత్మా ఫూలే, అంబేడ్కర్, నారాయణగురు, వల్లలార్, వైకుంఠర్ వంటి చాలామంది నాయకులు గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తన మంత్రివర్గ సమావేశంలో ఉదయనిధి వ్యాఖ్యలపై దీటుగా స్పందించాలని పేర్కొన్నట్లు తెలిసి నిరుత్సాహపడ్డానని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా.. తన తలకు వెల కట్టిన స్వామీజీతో పాటు ఇతరుల దిష్టిబొమ్మల్ని డీఎంకే కార్యకర్తలు, అభిమానులు దహనం చేస్తుండడంపై మంత్రి ఉదయనిధి స్పందించారు. అలా చేయొద్దని పిలుపిచ్చారు. మరోవైపు.. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధిని, ఆ సమయంలో అక్కడే ఉండి కూడా నోరు మెదపని రాష్ట్ర దేవాదాయ మంత్రి పీకే శేఖర్‌బాబును తక్షణం పదవుల నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడు బీజేపీ గురువారం గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిసి వినతిపత్రం సమర్పించింది.