Share News

Petrol Diesel Vehicles: ఇకపై పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయొద్దు.. సీఎం ఆదేశాలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:55 PM

గ్రీన్ & క్లీన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని.. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెద్దఎత్తున ప్రోత్సాహిస్తుందని తెలిపారు. ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ శాఖలు డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల్ని కొనుగోలు చేయాలనుకుంటే..

Petrol Diesel Vehicles: ఇకపై పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయొద్దు.. సీఎం ఆదేశాలు

Petrol Diesel Vehicles: గ్రీన్ & క్లీన్ హిమాచల్ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా.. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధించారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయొద్దని ఆయన ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. గ్రీన్ & క్లీన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని.. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెద్దఎత్తున ప్రోత్సాహిస్తుందని తెలిపారు. ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ శాఖలు డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల్ని కొనుగోలు చేయాలనుకుంటే.. అప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. సీఎం సుఖ్విందర్ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి గ్రీన్ & క్లీన్ హిమాచల్ కోసం పాటు పడుతున్నారు. ఇప్పటివరకూ ఆయన ఎలక్ట్రానిక్ వాహనాల్ని పోత్రాహించేందుకు వివిధ రకాల నిబంధనల్ని సైతం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే.. లేటెస్ట్‌గా సరికొత్త ఆంక్షల్ని విధించారు. ఇప్పటిదాకా హిమాచల్‌లో ప్రభుత్వ ఈ-వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య 2,733కి చేరుకుందని సీఎం తెలిపారు. ఎలక్ట్రానిక్‌ వాహనాలను పెంచేందుకు తమ ప్రభుత్వం స్థిరమైన ప్రయత్నాలు చేస్తోందని, ఇందుకు తాను సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ-వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సాహిస్తోందని.. రవాణా శాఖ తన అధికారిక వాహనాలను ఈ-వాహనాలతో భర్తీ చేసిన తొలి విభాగంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలు సైతం ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు.

ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఇంధన వాహనాల్ని కూడా దశలవారీగా ఎలక్ట్రానిక్ వాహనాలతో భర్తీ చేస్తామని సీఎం సుఖ్విందర్ అన్నారు. ఈ-వాహనాల వినియోగం అనేది కేవలం నూతన ఆరంభం మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను కూడా తెలియజేస్తుందని అన్నారు. రాబోయే తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించాలని, ఇందుకు నేటి నుంచే చర్యలు చేపట్టాలని చెప్పారు. మరోవైపు.. ఈ-వాహనాలను ప్రోత్సాహించేందుకు ఆరు హైవేలను గ్రీన్ కారిడార్లుగా అభివృద్ధి చేయాలని హిమచల్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) తన డీజిల్ బస్సులను దశలవారీగా ఈ బస్సులుగా మారుస్తోంది. సీఎం సుఖ్విందర్ కూడా గత కొన్ని నెలలుగా స్వయంగా ఈ-వాహనాన్ని వినియోగిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Updated Date - Dec 31 , 2023 | 09:55 PM