Share News

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

ABN , First Publish Date - 2023-11-22T16:55:24+05:30 IST

రాజస్థాన్‌లో అధికారం పొందడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పథకాల్ని ఉచితాలుగా అభివర్ణించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అవే హామీలను ఇస్తోంది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల్ని...

Yogi Adityanath: కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్.. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆరోపణలు

Rajasthan Elections: రాజస్థాన్‌లో అధికారం పొందడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పథకాల్ని ఉచితాలుగా అభివర్ణించిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అవే హామీలను ఇస్తోంది. అంతేకాదు.. ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రుల్ని సైతం రంగంలోకి దింపి, వారితో విస్త్రృత ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్‌లో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని కోరిన ఆయన.. ఇదే సమయంలో కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మాఫియా పెచ్చుమీరిపోయిందని.. కర్ఫ్యూ, అల్లర్లకు కాంగ్రెస్ కేరాఫ్ అని ఆరోపించారు.

రాజస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలలో సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, తమ పార్టీ నాయకులకు ఓట్లు వేయాలని ప్రజల్ని అడిగారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగకుండా మాఫియా అడ్డుకుంటోందని వ్యాఖ్యానించారు. కానీ.. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు లేవని, అల్లర్లను ప్రేరేపించే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కుంటున్నారని చెప్పారు. యూపీ అల్లరిమూకలు నరకానికి పయనమయ్యారని, వాళ్లు మళ్లీ మానవ లోకానికి తిరిగి రారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రతి ఏటా దీపోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, లక్షలాది దీపాలను వెలిగిస్తుండటంతో అయోధ్యలో మహత్తరమైన శోభ సంతరించుకుందని పేర్కొన్నారు.

కానీ.. రాజస్థాన్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని యోగి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక విద్యుత్, పెట్రోల్ & డీజిల్ ధరల భారంతో పాటు మరెన్నో సవాళ్లను రాష్ట్రం ఎదుర్కుంటోందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని అన్నారు. విదేశాల్లో ప్రధాని మోదీని ఎంతో గౌరవంగా స్వాగతిస్తున్నారని, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. ఇది కేవలం మోదీకి మాత్రమే దక్కుతున్న మర్యాద కాదని.. ఇది 142 కోట్ల మంది భారతీయుల గౌరవమని వివరించారు. ఇప్పుడు ఉగ్రవాదుల రహస్య స్థావరాలు, వారి యజమానులను సర్వనాశనం చేయడం జరుగుతోందన్నారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం కర్ఫ్యూ, అల్లర్లను సృష్టిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


చిత్తోర్‌గఢ్‌ బీజేపీ అభ్యర్థి నర్పత్ సింగ్ రాజ్‌వీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. చిత్తోర్‌గఢ్, మేవార్‌ల గొప్ప వారసత్వం గురించి సీఎం యోగి ప్రస్తావించారు. ఈ భూమికి వందల సంవత్సరాల ధీరత్వం ఉందని, ఇది పరాక్రమ చరిత్రను కలిగి ఉందని చెప్పారు. మహారాణా ప్రతాప్, మహారాణా సంగ, పన్నా ధాయ్, మహారాణి పద్మిని, మీరాబాయి వంటి దిగ్గజ వ్యక్తులను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చేతక్ వంటి గుర్రం కూడా దైవత్వ లక్షణాలను పెంపొందించుకుందని అన్నారు. అయితే.. రాజస్థాన్‌లో మాత్రం అనేక రకాలు మాఫియాలు పుట్టుకొచ్చాయని, అవి అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయని అన్నారు. దృఢ సంకల్పంతో ఈ మాఫియా సంస్థలను పూర్తిగా నిర్మూలించవచ్చని సీఎం యోగి పిలుపునిచ్చారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాజస్థాన్‌లో మాఫియా పాలనకు ముగింపు పలకొచ్చని సీఎం యోగి పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో పురోగతి, అభివృద్ధికి బాటలు వేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక పురోగతి, విశ్వాసం, పేద సంక్షేమం, పర్యాటకం పరంగా మాత్రమే కాదని.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నేరాల్లో మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ కర్ఫ్యూల వ్యాప్తిపై దృష్టి సారిస్తే.. ప్రతి ఇంటికి కుళాయిల నుండి స్వచ్ఛమైన తాగునీటిని అందించే కార్యక్రమాలను ప్రధాని మోదీ చేపట్టనున్నారని నొక్కి చెప్పారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు.

వ్యవసాయ సమస్యల పరిష్కరించడంలో బీజేపీ నిబద్ధతను నొక్కి చెప్తూ.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వరుసగా నాల్గవ సంవత్సరం విజయవంతమైందని యోగి ఆదిత్యనాథ్ హైలైట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆత్మహత్యలకు గురిచేస్తోందని, రాష్ట్రం నుంచి యువత వలసబాట పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి పట్ల విజన్ లేకపోవడం వల్ల రాజస్థాన్‌లో భద్రత, పురోగతి లోటు ఏర్పడిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో రామనవమి నాడు ఆంక్షలు లేకుండా గరిష్ట ఊరేగింపులు జరుగుతుంటే.. రాజస్థాన్‌లో పండుగల సమయంలో కర్ఫ్యూలు విధించబడతాయని మండిపడ్డారు. పండుగ వేడుకలకు విరుద్ధమైన విధానాల్ని కాంగ్రెస్ చేపడుతోందని సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-22T16:55:26+05:30 IST