Karnatka Elections: సీఎంఓపై డీకే సంచలన ఆరోపణ
ABN , First Publish Date - 2023-04-22T17:24:39+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కార్యాలయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) వేళ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లలో తప్పులు పట్టేందుకు, బీజేపీ నామినీల దరఖాస్తుల్లో తప్పులు సరిచేందుకు రిటర్నింగ్ అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం పిలిపిస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరారు. నిజానిజాలు నిర్ధారించేందుకు సీఎంఓకు సమన్లు పంపాలని కూడా విజ్ఞప్తి చేశారు.
''నా దరఖాస్తును తోసిపుచ్చేందుకు ఎంత పెద్ద టీమ్ పనిచేసిందో నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆ విషయాన్ని మీకు సమగ్రంగా వివరించాను'' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటి వరకూ తాను 10 సార్లు ఎన్నికల దరఖాస్తులు పూర్తి చేశానని, తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మామూలు అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులందరికీ ఒత్తిడి పెంచుతున్నారని, ఇబ్బడిముబ్బడిగా అధికార దుర్వినియోగం జరుగుతోందని, ఈ విషయాన్ని ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ఆరోపణలను డీకే తిప్పికొడుతూ, తమది 40 శాతం కమిషన్ల పార్టీ కాదని పరోక్షంగా బీజేపీని ఎద్దేవా చేశారు. తమ పార్టీ బిల్డింగ్ ఫండ్ రైజ్ చేస్తోందని, సాధారణ అభ్యర్థుల నుంచి రూ.2 లక్షలు, ఎస్‌సీఎస్‌టీ అభ్యర్థుల నుంచి లక్ష రూపాయలు కలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండగా, జేడీఎస్ కీలక భూమిక పోషిస్తోంది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 13న ఫలితాలను ప్రకటిస్తారు.