Share News

PM Narendra Modi: కాంగ్రెస్ & అభివృద్ధి ఒకే చోట ఉండలేవు.. ఛత్తీస్‌గఢ్ ప్రచారంలో ప్రధాని మోదీ ధ్వజం

ABN , First Publish Date - 2023-11-02T18:45:07+05:30 IST

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. ఒక గిరిజన మహిళ మన దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. సమాజంలోని ప్రతి వర్గానికి...

PM Narendra Modi: కాంగ్రెస్ & అభివృద్ధి ఒకే చోట ఉండలేవు.. ఛత్తీస్‌గఢ్ ప్రచారంలో ప్రధాని మోదీ ధ్వజం

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. ఒక గిరిజన మహిళ మన దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి లబ్ది చేకూరాలన్నది తమ పార్టీ విధామన్న మోదీ.. కాంగ్రెస్, అభివృద్ధి ఒకే చోట కలిసి ఉండలేవని వ్యాఖ్యానించారు. అసాధ్యం అనిపించిన పనులన్నీ కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి లబ్ధి చేకూరాలన్నదే బీజేపీ విధానం. దేశ చరిత్రలో తమ బీజేపీ ఒక గిరిజన కుటుంబానికి చెందిన కుమార్తెను రాష్ట్రపతిని చేసింది. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. ఆమె (ద్రౌపది ముర్ము)పై దుష్ప్రచారం చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. కాంగ్రెస్ చేస్తోన్న ఈ నిరసన బీజేపీకి వ్యతిరేకంగా కాదు.. గిరిజన కూతుళ్లపైనే’’ అని పేర్కొన్నారు. మోదీ హామీ అంటే ప్రతి హామీని నెరవేర్చే హామీ అని.. గత తొమ్మిదేళ్లలో ఎన్నో పనులని పూర్తి చేశామని అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. ఆ హామీని తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు.


ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, స్వలాభం కోసమే ఆ పార్టీ నాయకులు పనిచేశారని మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలు, బీజేపీ కలిసి పని చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు ఇక్కడి బీజేపీ ప్రభుత్వంతో పోరాడుతూనే వచ్చిందని.. అయినా తాము రాష్ట్రాభివృద్ధికి కృషి చేశామని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేను, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి మాత్రమే కాదు.. మీ, మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవని చెప్పారు. గిరిజనులు, వెనుకబడిన వారి హక్కులను పరిరక్షించడం.. ఛత్తీస్‌గఢ్‌ను దేశంలోని అగ్ర రాష్ట్రాలలోకి తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని ఉద్ఘాటించారు.

గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు (ప్రజల్ని ఉద్దేశిస్తూ) చూశారని.. ఇన్నేళ్లలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఆస్తులు గణనీయంగా పెరగడాన్ని చూశారని మోదీ వ్యాఖ్యానించారు. మరి పేద, దళిత, వెనుకబడిన, గిరిజన కుటుంబాలకు ఏం దక్కింది? ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శిథిలావస్థలో ఉన్న రోడ్లు, అధ్వాన్నంగా ఉన్న ఆసుపత్రులు, పాఠశాలలు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వడంలో కాంగ్రెస్‌ కొత్త రికార్డు సృష్టించిందని ఆరోపించారు. పేదల సంక్షేమమే కేంద్రంలోని తమ ప్రభుత్వ ప్రాధాన్యత.. వర్తమానం, భవిష్యత్తు రెండింటినీ పట్టించుకుంటామని మోదీ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-02T22:43:56+05:30 IST