Congress: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి

ABN , First Publish Date - 2023-05-14T09:16:50+05:30 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టి పెట్టింది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ...

Congress: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టి పెట్టింది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరు (Bangalore)లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (CLP) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల పదో తేదీన ఎన్నికలు జరిగితే.. ఏకంగా 136 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా.. ఏకంగా 19 బహిరంగ సభలు, ఆరు రోడ్‌ షోలు నిర్వహించినా.. జై బజరంగ బలీ అంటూ నినదించినా.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి 56 సీట్లు అదనంగా రావడం విశేషం! కాంగ్రెస్‌ విజయ యాత్రలో బీజేపీ, జేడీఎస్‌ కంచుకోటలు తునాతునకలయ్యాయి. ఈ విజయంతో దక్షిణాదిలో ఆ పార్టీ మళ్లీ ఖాతా తెరిచినట్లయింది. అధికార బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 39 సీట్లను కోల్పోయింది! అంతేనా.. దక్షిణాదిలో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక ప్రభుత్వమూ చేజారింది! తద్వారా, దక్షిణ భారతదేశం ‘బీజేపీ ముక్త్‌’గా ఆవిర్భవించింది! ఇక, ఓటర్ల విస్పష్ట తీర్పుతో ‘కింగ్‌ మేకర్‌’ ఆశలు పెట్టుకున్న జేడీఎస్‌ ఆశలూ గల్లంతయ్యాయి! ఆ పార్టీ కేవలం 19 స్థానాల్లోనే ఉనికి చాటింది! గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాలు గల్లంతయ్యాయి. ఆ పార్టీకి గట్టి పట్టున్న మైసూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. చివరికి, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ కర్ణాటకలోనూ జేడీఎస్‌ గెలిచిన సీట్లు కేవలం మూడే! విచిత్రంగా, ఓట్ల శాతంలో కాంగ్రెస్‌ భారీగా లాభపడింది. కానీ, బీజేపీ ఓట్ల శాతంపై పెద్దగా ప్రభావం పడలేదు. ఎందుకంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 36.5 శాతం ఓట్లు వస్తే.. ఇప్పుడు 35.9 శాతం ఓట్లను సాధించింది. అప్పటికి, ఇప్పటికి తేడా కేవలం 0.6 శాతమే! అయినా, 39 సీట్లు తగ్గిపోయాయి. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 38.4 శాతం ఓట్లు వస్తే.. ఈసారి అది 43 శాతానికి పెరిగింది. ఓట్లు భారీగా గండి పడింది మాత్రం జేడీఎ్‌సకే. ఆ పార్టీకి గత ఎన్నికల్లో 18.3 శాతం ఓట్లు వస్తే.. ఇప్పుడు కేవలం 13.3 శాతానికే పరిమితమైంది.

కాగా కన్నడ నాట కాంగ్రెస్‌ పార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి విజయపతాకాన్ని ఎగురవేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకటిన్నర డజన్ల దాకా దిగ్గజ సర్వే సంస్థలు బుధవారం ఎన్నికలు జరగ్గానే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను విడుదల చేశాయి. ఒకట్రెండు సంస్థలు బీజేపీకి పట్టమని చెప్పగా.. మిగతావాటిల్లో కొన్ని మాత్రమే కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు వస్తాయని తెలిపాయి. ఇంకొన్ని సంస్థలు అత్యధిక స్థానాలతో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ చేరువలో ఉంటుందని, హంగ్‌ తథ్యమని చెప్పాయి. ఒక్క ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా మాత్రమే.. కాంగ్రెస్‌కు 122–140 స్థానాలు వస్తాయని, బీజేపీ 62–80కి, జేడీఎస్‌ 20–25కు పరిమితమవుతాయని పేర్కొనడం గమనార్హం. కర్ణాటకలోని ఆరు ప్రధాన రీజియన్ల వారీగా ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఒకట్రెండు చోట్ల కాస్త అటూఇటుగా ఉన్నా.. అవే నిజమయ్యాయి.

కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ(16) వస్తాయని చెప్పగా.. ఇంచుమించుగా నిజమైంది. కాంగ్రెస్‌కు మధ్య కర్ణాటకలో 12, కల్యాణ్‌(ముంబై) కర్ణాటకలో 28, బెంగళూరు రీజియన్‌లో 17, పాత మైసూరులో 36, హైదరాబాద్‌–కర్ణాటకలో 32 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌ సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ మార్కును చేరుకుంటుందని ఇండియాటుడే– యాక్సిస్‌ మై ఇండియాతోపాటు.. ఆత్మ సాక్షి(117–124), ఇండియాటీవీ–సీఎన్‌ఎక్స్‌(110–120), జీన్యూస్‌–మాట్రైజ్‌ (103–118), న్యూస్‌24–టుడేస్‌ చాణక్య(120), టైమ్స్‌నౌ–ఈటీజీ(113) ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. మరికొన్ని సంస్ధలు అత్యధిక స్థానాలున్న పార్టీగా కాంగ్రెస్‌ అవతరిస్తుందని జోస్యం చెప్పాయి. అయితే.. ఈ సంస్థలు బీజేపీ, జేడీఎస్‌లకు సీట్లు తగ్గుతాయని పెద్దగా అంచనా వేయలేకపోయాయి.

Updated Date - 2023-05-14T09:16:50+05:30 IST