PM Modi: రాజేష్ పైలట్‌పై నేను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదు: మోదీ
ABN , First Publish Date - 2023-11-23T16:10:39+05:30 IST
Rajesh Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) తండ్రి రాజేష్ పైలట్ పై తాను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.
జైపుర్: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) తండ్రి రాజేష్ పైలట్ పై తాను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భిల్వారాలో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజేష్ పైలట్ ని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకొని తరువాత పాలల్లో ఈగలా పక్కన పెట్టిందని ప్రధాని ఇటీవల ఆరోపించారు.
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో తండ్రిపై శిక్ష విధించగా.. ఇప్పుడు సచిన్ పైలట్ కి కూడా అదే శిక్ష విధిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ విధానాలను విమర్శించిన వారందరికీ ఇలాగే చేస్తారా అని ప్రశ్నించారు. తన ప్రశ్నలపై కాంగ్రెస్ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో సచిన్ పైలట్ బలిపశువు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నిన్నటి నుంచి కాంగ్రెస్ రాజకుటుంబం నన్నే విమర్శిస్తొంది. రాజేష్ పైలట్‌ను ఎప్పుడూ అవమానించలేదని కాంగ్రెస్ అవాస్తవాలు మాట్లాడుతోంది. కానీ నేను లేవనెత్తిన ప్రశ్నకు పార్టీ నేతలు సమాధానం ఇవ్వడం లేదు. ఒక గుర్జర్ కుమారుడు(సచిన్ పైలట్) రాజకీయాల్లో తన మార్క్ చాటడానికి కష్టపడుతున్నారు. కాంగ్రెస్ కు తన జీవితాన్నిచ్చారు. ఆయన్ని ఉపయోగించుకున్న తరువాత కాంగ్రెస్ రాజకుటుంబం పాలలో ఈగలా మారుస్తుంది. ఆ పార్టీ నేతలు దివంగత రాజేష్ పైలట్‌తో కూడా అదే చేశారు. ఆయన కొడుకుతో కూడా అదే చేస్తున్నారు. రాజేష్ పైలట్ ప్రశ్నించడంతో ఆయన వైఖరి నచ్చక పక్కనపెట్టి.. ఇప్పుడు కుమారుడిపై కోపం తీర్చుకుంటున్నారు. మీకు కాంగ్రెస్(Congress) చరిత్ర తెలుసు. ఢిల్లీ హైకమాండ్ కారణంగా పార్టీలోని తప్పులకు వ్యతిరేకంగా స్వరం పెంచడానికి ఎవరు ప్రయత్నించినా రాజకీయంగా నష్టపోతారు. రాజేష్ పైలట్ ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. అది కూడా ఆ పార్టీ మంచి కోరి చేసిందే. కానీ పార్టీ ఇప్పటి వరకు సచిన్ పైలట్‌ను శిక్షిస్తోంది. తండ్రి మీద కోపంతో సచిన్ పైలట్ పట్ల ద్వేషపూరిత భావనతో ఉంది" ప్రధాని విమర్శించారు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాల్లో 30-35 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే గుర్జర్ కమ్యూనిటీకి చెందిన పైలట్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పచ్చి అబద్ధాలు..
రాజేష్ పైలట్(Rajesh Pilot), సచిన్ పైలట్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మండిపడ్డారు. దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్ఫూర్తితో రాజేష్ పైలట్ భారత వైమానిక దళాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన సచిన్ పైలట్.. తన తండ్రి జీవితమంతా కాంగ్రెస్ వాదిగా ఉన్నారన్నారు.
ప్రధాని వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రధానమంత్రిగా ప్రకటించడంపై రాజేష్ పైలట్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. 1996లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేస్రీపై పోటీ చేసిన ఇద్దరు నేతలలో ఆయన కూడా ఒకరు.
రాజేష్ పైలట్ 2000లో మరణించగా ఆయన కుమారుడు సచిన్ పైలట్ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2020లో రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్‌లో రాజకీయ సంక్షోభం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య వైరం పెరిగిన పార్టీ అధిష్టానం చొరవతో సద్దుమణిగింది.