Congress: ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని కూరలో కరివేపాకులా తీసేసిన కాంగ్రెస్.. తమదే విజయమని ధీమా
ABN , First Publish Date - 2023-12-01T22:28:46+05:30 IST
గురువారం సాయంత్రం వచ్చిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నేత ప్రమోద్ తివారీ కూరలో కరివేపాకులాగా తీసివేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనకు నమ్మకం లేదన్న ఆయన.. తనపై తనకు నమ్మకం ఉందని...
Congress On Exit Polls 2023: గురువారం సాయంత్రం వచ్చిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ నేత ప్రమోద్ తివారీ కూరలో కరివేపాకులాగా తీసివేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తనకు నమ్మకం లేదన్న ఆయన.. తనపై తనకు నమ్మకం ఉందని, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ధ్వజమెత్తారు.
ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కరాఖండీగా తేల్చి చెప్పారు. ఇక మిజోరాంలో తాము లేకుండా ప్రభుత్వం ఏర్పడదని, అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే.. ఏ సర్వే కూడా ఒకదానికొకటి సమానంగా లేదన్నారు. సర్వేలు అన్ని చోట్లా విభిన్నంగా ఉంటాయి కాబట్టి తాను సర్వేలను నమ్మనని తేల్చి చెప్పారు. తనపై తనకు నమ్మకం ఉందని.. 4 రాష్ట్రాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ప్రధాని మోదీపై ధ్వజమెత్తుతూ.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ ఆయన ఉల్లంఘించారని ప్రమోద్ తివారి ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం తప్ప ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. ఈసారి తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈసారి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని, ఇది తన అనుభవంతో చెప్తున్నానని మరోసారి స్పష్టం చేశారు.