రాజస్థాన్‌లో కాంగ్రెస్ సమైక్యతా రాగం
ABN , First Publish Date - 2023-11-17T04:35:05+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య ‘ముందు మీరు..
గహ్లోత్, సచిన్‌లతో కలిసి రాహుల్ గాంధీ అభివాదం
జైపూర్, నవంబరు 16: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య ‘ముందు మీరు.. కాదు ముందు మీరు’ అనే సన్నివేశం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి రాహుల్ మంగళవారమే జైపూర్‌కు వచ్చారు. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో సోనియా రెండు రోజులుగా జైపూర్‌లోనే ఉంటున్నారు. మరోవైపు ఈనెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకొంది. గహ్లోత్, పైలట్‌లతో కలిసి రాహుల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ ముగ్గురూ మీడియా ముందుకు వచ్చే సమయంలో ‘ముందు మీరు నడవండి..’ అంటూ పరస్పరం గౌరవించుకునే సన్నివేశం కొన్ని క్షణాలపాటు కొనసాగింది. అప్పటికే మీడియా ప్రతినిధులు త్వరగా రావాలని గోల చేస్తుండటంతో ముగ్గురూ కలిసి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘మేం కలిసి ఉన్నట్టు కనిపించడమే కాదు. కలిసే ఉన్నాం. కలిసే ఉంటాం. ఇక్కడ ఎన్నికల్లో గెలుస్తున్నాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ గహ్లోత్ చిరునవ్వులు చిందించారు. రాజస్థాన్‌లో అధికారాన్ని కాపాడుకునేందుకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రదర్శించిన తాజా ఐక్యత ఇది.