G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌కి ఆమోదం.. జీ20 సమ్మిట్‌లో ఏకాభిప్రాయం కుదిరిందన్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-09-09T18:35:44+05:30 IST

ఢిల్లీ వేదికగా శనివారం జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ తాజాగా ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు...

G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్‌కి ఆమోదం.. జీ20 సమ్మిట్‌లో ఏకాభిప్రాయం కుదిరిందన్న ప్రధాని మోదీ

ఢిల్లీ వేదికగా శనివారం జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ తాజాగా ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు. ఇందులో మునుపటి సమావేశాల కన్నా ఎక్కువ ఫలితాలతో పాటు రికార్డ్ స్థాయిలో పత్రాలు ఉన్నాయి. అయితే.. ఉక్రెయిన్‌లో యుద్ధం, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భిన్నాభిప్రాయాల కారణంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం పొందేందుకు కొంచెం ఆలస్యం అయ్యింది. ఏదైమైనా.. దీనిపై ఏకాభిప్రాయం రావడంతో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు.


ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ఒక గుడ్ న్యూస్ ఉంది. మా బృందం కృషి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతుతో న్యూ ఢిల్లీ జీ20 లీడర్ల సమ్మిట్ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి చేరుకుంది’’ అని చెప్పారు. దీనిని G20 నాయకులందరూ స్వీకరించాలని, ఇది జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన మంత్రులకు, షెర్పాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. అటు.. జీ20 సమావేశాల్లో పాల్గొనడం కోసం నిన్న భారత్‌కు వచ్చిన విదేశాంగ మంత్రులు.. వాతావరణంతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కోవడానికి అంగీకారం తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ.. జీ20 చరిత్రలో భారత జీ20 ప్రెసిడెన్సీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ సమ్మిట్‌లో ఏకాభిప్రాయం పొందిన న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో.. 73 ఫలితాలతో పాటు 39 అనుబంధ పత్రాలున్నాయన్నారు. ఇది మునుపటి సమావేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ అని చెప్పారు. దీని వల్ల యుద్ధ యుగం ముగుస్తుందని.. కొవిడ్ తర్వాత ప్రపంచంలో ఇది ప్రధాన మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.

Updated Date - 2023-09-09T18:35:44+05:30 IST