Covid-19: పెరుగుతున్న కోవిడ్ కేసులతో జర..భద్రం..!

ABN , First Publish Date - 2023-04-09T12:20:54+05:30 IST

కోవిడ్-19 కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్ ఆంక్షలను ..

Covid-19: పెరుగుతున్న కోవిడ్ కేసులతో జర..భద్రం..!

న్యూఢిల్లీ: కోవిడ్-19 (Covid-19) కేసులు కొద్ది రోజులుగా గణనీయంగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ మాస్క్ ఆంక్షలను పునరుద్ధరించాయి. హర్యానా, కేరళ, పుదుచ్చేరి ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించాయి. కేంద్రం ఆరోగ్య మంత్రి మన్షుక్ మాండవీయ (Mansukh Mandaviya) గతవారంలో సమీక్షా సమావేశం జరిపి, రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆరోగ్య సేవల సన్నద్ధతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచనలు చేశారు. ఆ వెనువెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారిలతో పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్‌ను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మాక్ డ్రిల్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పూర్తి సన్నద్ధతతో ఉన్నాం: మాండవీయ

కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు మళ్లీ పెరుగుతున్నందున పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్రిటికల్ కేర్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచుతున్నామని, ఏర్పాట్ల సన్నద్ధతపై వారంవారం సమీక్షిస్తున్నామని చెప్పారు.

నాలుగో వేవ్‌కు అవకాశాలపై మంత్రిని అడిగినప్పుడు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని అన్నారు. ఇంతవరకూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 వేరియంట్ చివరిది కాగా, కొత్తగా ఇప్పుడు XBB1.16 సబ్ వేరియంట్‌ కోవిడ్ కేసుల పెరుగదలకు కారణమవుతోందని, తమ మంత్రిత్వ శాఖ అనుభవం ప్రకారం సబ్-వేరియంట్లు మరీ అంత ప్రమాదం కావని చెప్పారు.

హర్యానా

కరోనా కేసుల్లో పెరుగుదల కారణంగా హర్యనా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలను రాష్ట్ర ఆరోగ్య శాఖ కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ జాగ్రత్తలు పాటించేలా చూడాలని జిల్లాల యంత్రాంగం, పంచాయతీలను ఆరోగ్య శాఖ ఆదేశించింది.

కేరళ

గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి కేరళ ప్రభుత్వం మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేసేందుకు కేరళ ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. కేవిడ్ మృతుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారు, డయాబెటిస్ వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నట్టు తెలుస్తోందని చెప్పారు. ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య శాఖను జార్జ్ ఆదేశించారు. త్వరలోనే ప్రైవేటు ఆసుపత్రులతో ప్రత్యేక సమావేశం జరుపుతామని చెప్పారు.

పుదుచ్చేరి

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ తక్షణ ఆదేశాలను పుదుచ్చేరి ప్రభుత్వం జారీ చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, లిక్కర్ దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోదరంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'హై-ప్రియారిటీ' అదేశాలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ‌తప్పనిసరి చేస్తూ అధికారులకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ పాజిటివ్‌ శాంపుల్స్‌ను జెనోమ్ సీక్వెన్వింగ్‌కు పంపాలని ఆదేశించింది.

ఢిల్లీ

వైద్య పరీక్షలు పెంచాలని ఢిల్లీలోని ఆసుపత్రులు, పోలీక్లినిక్‌లు, డిస్పెన్సరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీలో కేసులు పెరగడానికి XBB.1.16 వేరియంట్ కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పని లేదని, కోవిడ్ నిబంధనలు పాటించడం, బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు.

Updated Date - 2023-04-09T12:20:54+05:30 IST