PM Modi : ఆవు పేడనూ వదల్లేదు

ABN , First Publish Date - 2023-10-01T02:41:53+05:30 IST

కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతేనని, చివరకు ఆ పార్టీ ఆవు పేడను కూడా వదిలిపెట్టలేదని ప్రధాని మోదీ అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో ప్రతి స్కీమ్‌లోనూ స్కాములకు పాల్పడ్డారని మండిపడ్డారు.

PM Modi : ఆవు పేడనూ వదల్లేదు

కాంగ్రెస్‌ ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌లే.. ఓబీసీనంటూ నన్ను దూషిస్తున్నారు

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ ఫైర్‌

రాయ్‌పూర్‌, సెప్టెంబరు 30: కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతేనని, చివరకు ఆ పార్టీ ఆవు పేడను కూడా వదిలిపెట్టలేదని ప్రధాని మోదీ అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో ప్రతి స్కీమ్‌లోనూ స్కాములకు పాల్పడ్డారని మండిపడ్డారు. కేంద్రం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఛత్తీ్‌సగఢ్‌కు అందకుండా అధికార కాంగ్రెస్‌ పార్టీ అడ్డుపడుతోందన్నారు. కులం పేరిట మహిళల్లో విభజనకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, ఓబీసీనంటూ తనను అవమానిస్తోందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని బిలా్‌సపూర్‌లో మోదీ శనివారం పర్యటించారు. ‘పరివర్తన్‌ మహా సంకల్ప్‌’ పేరిట జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ‘‘మీ కలలే నా తీర్మానాలని హామీ ఇస్తున్నాను. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే మీ కలలు నెరవేరుతాయి. ఛత్తీ్‌సగఢ్‌కు చేయూతనివ్వాలని మేం ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాం. వాటిన్నింటినీ కాంగ్రెస్‌ నిష్ఫలం చేసింది. రహదారులు, రైల్వేలు, ఎలెక్ర్టిసిటీ తదితర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలను ఛత్తీ్‌సగఢ్‌ గత ఐదేళ్లకాలంలో పొందింది. కేంద్రం వద్ద నిధులకు కొదవ లేదు’’ అని మోదీ అన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద కేంద్రం అందిస్తున్న బియ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, మద్యంలో రూ.కోట్లు నొక్కేసిందని, చివరకు ఆవు పేడను కూడా వదిలిపెట్టలేదని ఆరోపించారు.

‘మోదీ’ పేరిట అవమానిస్తున్నారు..

కులం పేరిట మహిళల్లో విభజనకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మోదీ విమర్శించారు. ఓబీసీ అయిన తనపై కాంగ్రెస్‌ విషం కక్కుతోందని, దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలను సైతం అవమానిస్తోందన్నారు. ‘మోదీ’ పేరిట దేశంలో వెనుకవడిన వర్గాలన్నింటినీ కాంగ్రెస్‌ కించపరుస్తోందన్నారు. కోర్టు శిక్షకు ఆ పార్టీ నాయకుడు గురయిన తర్వాత కూడా, వారికి బుద్ధి రావడం లేదన్నారు.

వచ్చే ఏడాదీ నేను సమీక్షిస్తా..

బీజేపీ 2024 ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, తాను తిరిగి ప్రధానమంత్రిని అవుతానని మోదీ స్పష్టం చేశారు. ‘ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ, వచ్చే ఏడాది కూడా తానే ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తానని అధికారులతో ప్రధాని అనడం విశేషం. ‘‘ మనం తప్పకుండా వచ్చే ఏడాది అక్టోబరు- నవంబరు నెలల్లో తిరిగి కలుస్తాం. అప్పుడు ఈ కార్యక్రమం విజయాలను మదింపు వేద్దాం. వచ్చే ఏడాది మళ్లీ మనం కలుసుకుని మాట్లాడుకుందాం’’ అని తెలిపారు. ఆకాంక్షల జిల్లాలు ఇప్పుడు ప్రేరణాత్మక జిల్లాలుగా మారాయని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో అమలైన పది ఉత్తమ పథకాల్లో ఇది ఒకటని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 500 వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం వంద.. ‘ఆకాంక్ష ప్రాంతాల’ జాబితాలోకి చేరతాయన్నారు. ‘‘మీరు పనిచేస్తున్న చోట కనీసం వంద వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయండి. జాతీయ సగటు అభివృద్ధి సూచిక కంటే మిన్నగా వాటిని తీర్చిదిద్దండి. నెల రోజుల్లో ఈ ఘనతను మీరు సాధించాలి’’ అని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులను మోదీ నిర్దేశించారు.. ‘సంకల్ప్‌ సప్తాహ్‌’ పేరిట ‘ఆకాంక్ష జిల్లాల’ పథకం అమలుపై ఢిల్లీలో భారత్‌ మండపంలో ఏర్పాటుచేసిన సన్నాహక కార్యక్రమంలో అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ‘ఆకాంక్షల జిల్లాల’ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 7న మొదలైంది. ప్రస్తుతం 329 జిల్లాల పరిధిలో 500 బ్లాక్‌ల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది.

Updated Date - 2023-10-01T02:41:53+05:30 IST